పదిహేనేళ్ల క్రితం పొరపాటున పాకిస్తాన్ చేరిన బధిర బాలిక గీత స్వదేశానికి చేరింది. ఇంత కాలం ఆమెను కంటికి రెప్పలా చూసుకున్న ఈదీ ఫౌండేషన్ ప్రతినిధులు తోడురాగా, కరాచీ నుంచి ఢిల్లీ చేరింది. అయితే, ఆమె తండ్రిగా భావిస్తున్న వ్యక్తి వాదనను తిరస్కరించింది. అది తన కుటంబం కాదని చెప్పడం కొత్త ట్విస్ట్. ఇక డిఎన్ ఎ పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు. ఇంత కాలం ఆమె ఆలనా పాలనా చూసింది ఓ స్వచ్ఛంద సంస్థ. అందులో పాక్ ప్రభుత్వ ప్రమేయం లేదు. కానీ, ఆమెను పాక్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చినందుకు బదులుగా, భారత్ లోని జైళ్లలో ఉన్న తమ యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని పాక్ కోరుతోంది. మొత్తం 459 మంది ఖైదలను విడుదల చేస్తే వాళ్లు కూడా గీత లాగే స్వదేశం వెళ్తారని, కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తారని పాక్ వాదిస్తోంది. గీతతో పాటు కరాచీ నుంచి వచ్చిన పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి కూడా ఇలాగే మాట్లాడారు.
గీతను పదిహేనేళ్లు పోషించడం గొప్ప విషయమే. అందుకు ఈదీ ఫౌండేషన్ కు భారత్ ధన్యవాదాలు కూడా చెప్పింది. ప్రధాని మోడీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఆ సంస్థలు అభినందించారు. ధన్యవాదాలు చెప్పారు. అయినా, ఒక్క గీతను విమానంలో తీసుకు వచ్చినందుకు 459 మంది ఖైదీల విడులను కోరుకోవడం మామూలు విషయం కాదు. మానవత్వం విషయానికి వస్తే భారత్ చాలా సందర్భాల్లో ఆచరించిచూపింది. పాక్ కు ఎన్నోవిధాలుగా సహాయం చేసింది. ప్రాణాంతక వ్యాధులకు చికిత్స కోసం పాక్ నుంచి భారత్ వచ్చే వారికి ఉదారంగా, తక్కువ ఖర్చుతో, లేదా ఇక్కడి ప్రజల విరాళాలతో చికిత్స చేయడం చాలా సార్లు జరిగింది. మొన్న జూన్ నెలలో ముంబై లోని జస్లోక్ ఆస్పత్రిలో చికిత్స కోసం సబా అనే పదిహేనేళ్ల బాలికను ఆమె తల్లి పాక్ నుంచి తీసుకు వచ్చింది. వారి దగ్గర 80 వేలు మాత్రమే ఉన్నాయి. కానీ 5 లక్షలకు పైగా కావాలి. ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న ముంబై ప్రజలు ఒక్క రోజులో తలాఓ చెయ్యి వేసి నాలుగున్నర లక్షల రూపాయలు జమ చేశారు. ఆస్పత్రి వారికి ఇచ్చారు. దీంతో ఆ బాలికకు చికిత్స చేసి పంపించారు.
భారత్ లో పాకిస్తానీలు ఇలా ఎన్నో సార్లు సహాయం పొందారు. దానికి బదులుగా మనం ఏమీ అడగలేదు. అడిగితే అది మానవత్వం అనిపించుకోదు. కానీ పాకిస్తాన్ మాత్రం ఇక్కడ కూడా రాజకీయం చూపుతోంది. తన పాత బుద్ధినే చాటుతోంది. ఎన్ని జన్మలెత్తినా ఔదార్యం, మానవత్వం విషయంలో భారతీయుల కాలి గోటికి సాటి రామనే విషయాన్ని పాక్ ప్రభుత్వం గుర్తించడం లేదు.