వైకాపా మొదటి నుండి అమరావతి నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అత్యంత సారవంతమయిన పంట భూములపై రాజధాని నిర్మించాలనుకోవడం, దానికోసం ప్రభుత్వం రైతుల నుండి బలవంతంగా భూములు గుంజుకోవడం, రైతుల నుండి గుంజుకొన్న భూములను దేశవిదేశాలకు చెందిన కార్పోరేట్ సంస్థలకు అప్పనంగా ఇవ్వాలనుకోవడం వంటి కారణాల చేత వైకాపాతో సహా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం వారి విమర్శలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ముందుకే సాగిపోతోంది. అందుకే ఇంచుమించి ప్రతిపక్ష పార్టీలన్నీ అమరావతి శంఖుస్థాపన కార్యక్రమాన్ని బహిష్కరించాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాల ముంది వాటి వాదనలు అరణ్యరోదనగానే మిగిలిపోతున్నాయి. అమరావతి శంఖుస్థాపన కార్యక్రమాన్ని బహిష్కరించినందుకు తిరిగి కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డినే ప్రజల ముందు దోషిగా ప్రభుత్వం నిలబెట్టగలిగింది. అయితే వాటి పోరాటాలలో నిజాయితీ లోపించడం వలననే రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి అవకాశం కలుగుతోందని చెప్పవచ్చును.
రాజధాని కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు రైతులకు అండగా నిలబడి కడదాక పోరాడుతామని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి, తను ముఖ్యమంత్రి అయితే రైతుల భూములు తిరిగి ఇచ్చేస్తానని చెప్పడంతో ఆయనపై రైతులు నమ్మకం కోల్పోయారు. ఆ తరువాత ఆయన హటాత్తుగా ప్రత్యేక హోదా అంశం భుజానికెత్తుకొని రాజధాని రైతులను వారి కర్మకు వారిని వదిలిపెట్టారు. ప్రత్యేక హోదా కోసం మొదలుపెట్టిన దీక్షకు ఊహించినంతగా ప్రజా స్పందన రాకపోవడంతో మళ్ళీ నిన్న రాజధాని రైతుల వద్దకు వెళ్లి వారి తరపున పోరాడుతామని శపధాలు చేస్తున్నారు. ఒక సరయిన ఆలోచన, వ్యూహం, విధానం, చిత్తశుద్ధి, నిలకడ లేకుండా చేస్తున్న పోరాటాల వలన జగన్ తన విశ్వసనీయతను, రైతుల, ప్రజల నమ్మకాని కోల్పోవడమే కాకుండా ఆయన రాష్ట్ర అభివృద్ధి నిరోధకుడు, రాజధాని నిర్మాణం జరుగకుండా ఉద్దేశ్యపూర్వకంగానే అడ్డుపడుతున్నారనే భావన తనంతట తానే స్వయంగా వ్యాపింపజేసుకొంటున్నారు.
రాష్ట్రానికి చెందిన అతిముఖ్యమయిన అమరావతి శంఖు స్థాపన కార్యక్రమాన్ని బహిష్కరించడం, మళ్ళీ నిన్న రాజధాని ప్రాంతంలో మల్కాపురం గ్రామానికి వెళ్లి అక్కడ ఎవరో దుండగులు తగులబెట్టిన చెరుకు తోటను పరిశీలించిన తరువాత జగన్ రైతులను న్యాయపోరాటం చేయమని రెచ్చగొట్టడం వంటివి ఆ అనుమానాలు మరింత బలపడేందుకు దోహదపడుతున్నాయి. నిజానికి జగన్ పట్టుదలగా రైతుల తరపున నిలబడి తన పోరాటం కొనసాగించి ఉండి ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా యావత్ రైతాంగం ఆయనకు మద్దతు పలికేవారు. ప్రజలలో, రైతులలో ఆయనకు చాలా మంచి పేరు వచ్చి ఉండేది కానీ ఆయన బహుశః ప్రభుత్వం పునరాలోచన చేయక తప్పనిసరి పరిస్థితి ఎదురయ్యేది. కానీ జగన్ ఒక సువర్ణావకాశాన్ని కోల్పోవడమే కాకుండా తిరిగి చెడ్డపేరు సంపాదించుకొంటున్నారు.