హైదరాబాద్: విజయదశమినాడు అమరావతిలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోడి ఏపీకి ఏదో ఒక ప్యాకేజ్ ప్రకటిస్తారని అందరూ ఆశించటం, ఆయన దాని మాటే ఎత్తకపోవటం, దానిపై నిరసనలు భగ్గుమనటం తెలిసిందే. ఏపీకి ప్యాకేజ్‌పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ, ప్రధానమంత్రి కార్యాలయం శంకుస్థాపనకు ముందు కసరత్తు చేసినప్పటికీ మోడి ఆ కార్యక్రమంలో దానిని ప్రకటించకపోవటానికి కారణం – ఆ క్రెడిట్‌ను తెలుగుదేశానికి ముట్టజెప్పకూడదనే అని తెలుగు360.కామ్ నాలుగు రోజుల క్రితమే చెప్పింది. అది నిజమని తాజాగా తేలింది.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విస్తరణ పనులను ప్రారంభించటానికి ప్రధాని మోడి జనవరిలో వైజాగ్ రానున్నారని, ఆ కార్యక్రమంలో ఏపీకి రు.2 లక్షల కోట్ల స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించనున్నారని భారతీయ జనతాపార్టీ నేతలు వెల్లడించారు. జనవరినాటికి బీహార్ ఎన్నికలుకూడా ముగిసిపోతాయి కనుక ఏపీకి ప్యాకేజ్ ప్రకటించినా ఇబ్బందేమీ ఉండబోదని వారు చెబుతున్నారు. అదే వేదికపై విశాఖపట్నానికి రైల్వే జోన్‌ను కూడా మోడి ప్రకటిస్తారని బీజేపీ నేతలు అంటున్నారు. ప్రధాని జనవరిలో ఏపీలో జరపబోయే పర్యటనలో రాష్ట్ర ప్రజలకు శుభవార్తను చెప్పనున్నారని బీజేపీ రాష్ట్ర శాఖ కోఆర్డినేటర్ రఘురామ్ తెలిపారు. ఏపీ, తెలంగాణలలో పార్టీని మరింత పటిష్ఠం చేయటంకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.