హైదరాబాద్: సాధారణంగా ఏదైనా ఎన్నికలలో తమకు విజయావకాశాలు లేవని అధికారపార్టీకి ముందే అర్థమైనపుడు, ఆ ఫలితం తమకు రిఫరెండం కాదని ఆ పార్టీ నేతలు ముందే ఒప్పుకోవటం పరిపాటే. ఈ సంవత్సరం మొదట్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిగా ముందు అమిత్ షా, వెంకయ్యనాయుడు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి ఫలితాన్ని పరోక్షంగా ముందే చెప్పేశారు. ఇప్పుడు తాజాగా బీహార్ ఎన్నికలపై అమిత్ షా అలాంటి స్టేట్మెంటే ఇచ్చారు.
బీహార్ ఎన్నికలు నరేంద్ర మోడికి – ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా అత్యంత కీలకమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీ ఎన్నికలు మోడి-షా ద్వయానికి పెద్ద ఎదురుదెబ్బగా మిగలగా, బీహార్లోకూడా పరాజయం పాలైతే పార్టీలో వీరు పట్టు కోల్పోయే అవకాశాలున్నాయి. మరోవైపు రాజ్యసభలో మెజారిటీ లేకపోవటంతో మోడి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక బిల్లులు చట్టాలు కాకపోవటంతో ఆ మెజారిటీకోసం బీహార్ ఎన్నికలు అత్యవసరంగా మారాయి. అందుకే ఆయన ఆ ఎన్నికలలో విజయంకోసం సర్వశక్తులూ ఒడ్డి కృషిచేస్తున్నారు. అయితే ఎంత చేసినా ఉపయోగంలేదని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయో, ఏమోగానీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మాటతీరు మారింది. బీహార్లో జరుగుతున్న ఎన్నికలు మోడి పనితీరుకు, కేంద్ర ప్రభుత్వానికి రెఫరెండం కాదని అన్నారు. బీహార్లో వ్యతిరేక ఫలితం వస్తే కేంద్రం చేపట్టాలనుకుంటున్న సంస్కరణలకు, విధానాలకు బ్రేక్ పడుతుందన్న వాదనను కొట్టిపారేశారు. పార్లమెంట్లో తమకు స్పష్టమైన మెజారిటీ ఉండగా బీజేపీ విధానాలకు ఈ ఎన్నికలలో జయాపజయాలతో సంబంధం ఉండదని ఒక జాతీయ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. రెండు దశలు పూర్తయ్యి, మూడవ దశ జరగనున్న వేళ అమిత్ షా నోటివెంట ఈ వ్యాఖ్యలు రావటం విస్తృత చర్చకు దారితీసింది.