తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన పార్టీ తెలంగాణా అధ్యక్షుడు ఎల్.రమణ, పార్టీ సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులతో మంగళవారం సమావేశమయ్యి వరంగల్ ఉప ఎన్నికలలో పార్టీ పోటీ చేయడం గురించి చర్చించారు. వరంగల్ ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఉత్సాహం చూపిస్తున్నప్పటికీ బీజేపీకే పోటీ చేసే అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఒకవేళ సనత్ నగర్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నికలు జరిగినట్లయితే అక్కడ తెదేపా అభ్యర్ధిని నిలబెట్టాలని భావిస్తునట్లు తెలుస్తోంది. సమావేశం ముగిసిన తరువాత తెలంగాణా పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ వరంగల్ ఉప ఎన్నికలలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశం ప్రకారం ఆ సీటును మిత్రపక్షమయిన బీజేపీకి వదిలేయాలనుకొంటున్నట్లు తెలిపారు. దీనితో తెదేపా-బీజేపీల మధ్య టికెట్ కోసం నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయినట్లే భావించవచ్చును.
తెరాస కాంగ్రెస్ నేత జి. వివేక్ ని పార్టీలోకి రప్పించి వరంగల్ నుంచి పోటీ చేయించాలని ప్రయత్నించింది. అందుకు ఆయన కూడా మొదట సమ్మతించారు. కానీ ఆఖరు నిమిషంలో ఆయన మనసు మార్చుకొని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిశ్చయించుకొన్నారు. కనుక తెరాసను డ్డీ కొనేందుకే వివేక్ నే వరంగల్ నుండి నిలబెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది కానీ ఆయన అందుకు సమ్మతించడం లేదని సమాచారం. కాంగ్రెస్, తెరాస పార్టీలు రెండూ ఇంకా తమ అభ్యర్ధి పేరు ఖరారు చేయవలసి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా తమ అభ్యర్ధి పేరును ఖరారు చేయనప్పటికీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి ఈ ఎన్నికలలో తమ పార్టీ కనీసం లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని దృడంగా చెపుతున్నారు. వామపక్షాల మద్దతుతో గాలి వినోద్ స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగుతున్నారు. వామ పక్షాలు కూడా ఈ ఎన్నికలు అధికార తెరాసకు ఒక గుణపాఠం నేర్పబోతున్నాయని హెచ్చరిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలయిన తెదేపా, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు ఈ ఎన్నికలలో తామే తప్పకుండా గెలుస్తామని ఘంటాపథంగా చెపుతుంటే, అధికార తెరాస ఇంకా గెలుపు గుర్రం కోసం వెతుకులాడుతుండటం విచిత్రంగా ఉంది.