ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏదయినా ఒక పని పట్టుకొంటే ఇక ఎల్లప్పుడూ అదే ధ్యాసలో ఉంటూ, దాని గురించే మాట్లాడుతూ, ఆ పనినే చేస్తూ, అందరినీ పనిచేయిస్తూ మిగిలిన విషయాల పట్ల అశ్రద్ధ చూపిస్తుంటారని ఒక అపవాదు ఉంది. ఒక దాని నుంచి మరొక దానికి మారిపోతూ ప్రజలను కూడా అందులోకిలాగే ప్రయత్నం చేస్తుంటారు. అందుకు గోదావరి పుష్కరాలు, ఓటుకి నోటు కేసు, పట్టిసీమ ప్రాజెక్టు, అమరావతి భూసేకరణ, శంఖుస్థాపన వంటి కొన్ని ఉదాహరణలు కళ్ళ ముందున్నాయి. బహుశః ఈ విషయం ఆయన కూడా గ్రహించినట్లున్నారు. అందుకే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి, రాష్ట్రంలో పెండింగులో ఉన్న ఇతర సాగునీరు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడం గురించి మాట్లాడుతున్నారు.
ఈ సంవత్సరం రాష్ర్టంలో తీవ్ర వర్షాభావపరిస్థితులు నెలకొని ఉండటంతో చాలా జిల్లాలలో పంటలు పండక కరువు తాండవిస్తోంది. రాయలసీమ జిల్లాలలో రైతులు ఆర్ధిక సమస్యలు భరించలేక ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. అమరావతి మైకం నుంచి బయటపడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇపుడు రాష్ట్రంలో కరువు పరిస్థితిపై కూడా దృష్టి సారించారు. కరువు నివారణ చర్యలు చేప్పట్టేందుకు రాష్ట్రంలో కరువు మండలాలను ప్రభుత్వం ప్రకటించింది. ఆ మండలాలలో రైతులను ఆదుకొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అవసరమయిన నిధులు విడుదల చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాలలో అత్యధికంగా రాయలసీమ ప్రాంతంలోనే ఉన్నాయి. అన్నిటికంటే అత్యధికంగా కర్నూలులో 40 మండలాలు, అనంతపురంలో 39, చిత్తూరులో 39, కడపలో 33, ప్రకాశం 21, నెల్లూరు 14, శ్రీకాకుళం జిల్లాలో 10 మండలాలను కరవు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 196 కరువు మండలాలను ప్రభుత్వం గుర్తించింది. దీనిని బట్టి పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చును. ఇప్పటికయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితి చెయ్యి దాటిపోక ముందే మేల్కొనడం చాలా సంతోషమే.