ఖర్చులపై ఆంక్షలు విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు మూడురోజుల్లో జి ఒ జారీచేయబోతోంది. ఆదాయాలకు ఖర్చులకూ పొంతన కుదరని పరిస్ధితుల్లో ఆర్ధిక మంత్రిత్వ శాఖ ముందస్తు అనుమతి లేనిదే ముఖ్యమంత్రితో సహా మంత్రులు అధికారులు డబ్బు ఖర్చుతో ముడిపడి వున్న ఏపనీ పెట్టుకోకూడదు.ప్రస్తుత ఖర్చులను మూడోవంతుకి కుదించేలా కసరత్తులు చేసి ఆమేరకు గైడ్ లైన్స్ రూపొందిస్తున్నారు. ఆమార్గదర్శక సూత్రాలు సిద్ధమైన వెంటనే “తీవ్రమైన పొదుపు చర్యలపై ఉత్తర్వులు జారీ చేస్తారని తెలిసింది. ఈ నిర్ణయం వల్ల ముఖ్యమంత్రి తలపెట్టిన టర్కీ పర్యటనను పునఃసమీక్షించుకోవలసిన పరిస్ధితి ఏర్పడింది. ఇప్పటికే ఖరారైన పర్యటనలకు ఈ ”పొదుపు చర్యలు” వర్తించవు.
అసలే లోటుబడ్జెట్. బడ్జెట్టుని పట్టించుకోకుండా డబ్బుని మంచినీళ్ళలా ఖర్చుచేసే ధోరణి గోదావరి పుష్కరాలలో ప్రారంభమైంది. తొక్కిసలాటలో 28 మంది చనిపోయాక ముఖ్యమంత్రి నోటిమాటే బ్యాంకర్స్ చెక్ అన్నంత శక్తివంతమైన విత్ డ్రాయల్ ఇన్ స్ట్రమెంటు అయ్యింది. మంచినీళ్ళ పాకెట్లకు లక్షలరూపాయలు, భోజనం పొట్లాలకు కోట్లరూపాయలు ఖర్చు చేసేశారు.
ముఖ్యమంత్రి నివాసం విజయవాడకు తరలించాక సమీక్షాసమావేశాలకు అధికారులు మందీ మార్బలాలతో హైదరాబాద్ నుంచి విమానాల్లో విజయవాడ వెళ్ళరావడానికి విజయవాడలో ఫైవ్ స్టార్ బసకీ ఖర్చు కోట్ల రుపాయలకు చేరుకుంది. అమరావతి శంకుస్ధాపన ఖర్చు 400 కోట్లరూపాయలు అన్న విమర్శపై ”అంత లేదు” అనేవారేతప్ప ఎంతో చెప్పేవారు ప్రభుత్వంలోగాని, తెలుగుదేశంలోగాని ఎవరూ కనిపించడం లేదు.
అదుపులేని రీతిలో మారిపోయిన ప్రాధాన్యతలను పట్టాలకు ఎక్కించే విషయమై ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు కొద్దిరోజులుగా అధికారులతో సమాలోచనలు చేశారు.
పొదుపు చర్యలను ”తీవ్ర స్ధాయిలో” కొంతకాలమైనా అమలు చేయకపోతే అర్ధికంగా తేరుకోలేమని హెచ్చరించారు. ఆర్ధిక శాఖ సూచనలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే ఆమోదించారు. వారానికి రెండురోజులు ముఖ్యమంత్రి హైదరాబాద్ లోనే వుండి అధికారిక సమావేశాలు నిర్వహించడవల్ల ఉన్నతాధికారుల విజయవాడ రాకపోకల ఖర్చులు బాగాతగ్గుతాయన్న సూచనకు పొదుపు చర్యల రీత్యా కూడా ముఖ్యమంత్రి అంగీకరించారు.
పొదుపు చర్యలపై రాష్ట్రప్రభుత్వం వెలువరించనున్న ఉత్తర్వు ప్రకారం ప్రయాణ ఖర్చులు, విడిది ఖర్చులపై సీలింగ్ విధిస్తారు. అంటే సూపర్ లక్జరీ టాక్సీలకోసం రోజుకి పదిహేను వేల రూపాయల వరకూ కూడా ఖర్చు పెడుతున్న అధికారులకు ఇకపై రోజుకి నాలుగైదు వేలరూపాయలకు మించి కారు అలవెన్సు ఇవ్వరన్న మాట!