నిన్న మొన్నటి వరకు ప్రత్యేక హోదా గురించి మాత్రమే మాట్లాడిన వైకాపా నేతలు అకస్మాత్తుగా దానిని పక్కనబెట్టి మళ్ళీ ఇప్పుడు రాజధాని భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడటం మొదలుపెట్టారు. మళ్ళీ ప్రత్యేక హోదా కోసం తమ పోరాటం కొనసాగిస్తారో లేదో తెలియదు కానీ భూసేకరణకు వ్యతిరేకంగా కొన్ని రోజులు పోరాడబోతున్నట్లు స్పష్టం అవుతోంది. జగన్మోహన్ రెడ్డి మొన్న రాజధాని ప్రాంతంలో రైతులను కలిసి వారిని న్యాయపోరాటం చేయమని ప్రోత్సహించడం, రాష్ట్ర ప్రభుత్వానికి దమ్మూ ,ధైర్యం ఉంటే భూసేకరణకు నోటీసులు ఇవ్వాలని మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి సవాలు విసరడం గమనిస్తే ఆ సంగతి అర్ధమవుతుంది.
సహజంగానే అందుకు తెదేపా నేతలు, మంత్రులు జగన్ పై విరుచుకుపడ్డారు. అయన సవాలుకి స్పందించిన మంత్రి నారాయణ “రౌడీయిజం చేయడానికి దమ్ము దైర్యం కావాలి కానీ రైతులతో మాట్లాడటానికి అవెందుకు? అయినా రాజకీయాలలో ఉన్నవారు అటువంటి పదాలు వాడటం సరికాదు. రైతులను ఒప్పించి మేము భూసేకరణ చేస్తున్నాము తప్ప వైకాపా ఆరోపిస్తున్నట్లుగా దమ్ము, దైర్యం చూపించి కాదు. రైతుల సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. రైతులు కూడా మా అభ్యర్ధనకు సానుకూలంగానే స్పందిస్తున్నారు. మరి మధ్యలో వైకాపా నేతలకు అభ్యంతరం ఎందుకో నాకు అర్ధం కావడం లేదు,” అని అన్నారు.
ప్రభుత్వం నుండి వైకాపా అటువంటి సమాధానమే ఆశిస్తోంది గనుక వారు కూడా అందుకు ధీటుగానే జవాబిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం బలవంతంగా రైతుల భూములు లాక్కోనేందుకు ప్రయత్నిస్తే తాము వారి తరపున నిలబడి తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తున్నారు. తాము రైతులకు అండగా నిలబడి పోరాడుతుంటే, ప్రభుత్వం తమని అప్రదిష్ట పాలు చేసేందుకు తాము రైతులను రెచ్చగొడుతున్నామని తప్పుడు ప్రచారం చేస్తోందని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు.
ఆ మధ్యన ఒకసారి పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో రైతులను కలిసి మాట్లాడిన తరువాత, ప్రభుత్వం పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని మన్నిస్తూ భూసేకరణ ప్రక్రియను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. కానీ మళ్ళీ ఇప్పుడు మిగిలిన 1400 ఎకరాలను కూడా సేకరించేందుకు ప్రయత్నాలు వేగవంతం చేసింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఈ రాజకీయాలలో మధ్యలో రైతులు నలిగిపోతున్నారు. వారు తమ పంట భూములు కాపాడుకోవాలని చాలా తాపత్రయపడుతున్నప్పటికీ తెదేపా, వైకాపా నేతలలో ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. వారికి అండగా నిలబడతానని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ వారి సమస్య గురించి మాట్లాడటం లేదు. ఇక రాజధాని రైతులని ఆ దేవుడే కాపాడాలేమో?