ప్రస్తుతం బ్రూస్ లీ దెబ్బతో కనీసం బయట కూడా కనిపించని చరణ్ తన లేటెస్ట్ సినిమా అప్ డేట్స్ ఏవీ బయటకు రానివ్వడం లేదు. అయితే చెర్రి తీయబోయే తర్వాత సినిమా తని ఒరువన్ రీమేక్ అని ముందే ఫిక్స్ అయినా ఆ తర్వాత సినిమా కోసం కూడా ముందే పావులు కదిలిస్తున్నాడు. ఆ దారిలోనే చరణ్ త్రివిక్రంతో సినిమా గురించి తెగ ప్రయత్నిస్తున్నాడట. అసలైతే ప్రస్తుతం త్రివిక్రం తీస్తున్న అ..ఆ సినిమా తర్వాత మహేష్ తో గాని, పవన్ కళ్యాన్ తో గాని సినిమా ప్లాన్ చేస్తున్నాడు. తెలుస్తున్న వార్తల ప్రకారం పవన్ తన సినిమా స్క్రిప్ట్ ను చరణ్ కోసం త్యాగం చేస్తున్నాడని అంటున్నారు.
బ్రూస్ లీ చెప్పుకోలేని విధంగా ఫ్లాప్ అవ్వడంతో కాస్త ఇబ్బందుల్లో పడ్డ చరణ్ ఎలాగైనా సరే ఈ లోటుని ఓ హిట్ సినిమాతో తీర్చాలనుకుంటున్నాడు. అందుకే త్రివిక్రంతో మంతనాలు చేసి బాబాయ్ ని కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే త్రివిక్రం తీస్తున్న అ.ఆ మూవీ ఫిబ్రవరి దాకా షూటింగ్ జరుగుతుంది. ఈ లోపు తని ఒరువన్ సినిమాను కూడా త్వరగా ఫినిష్ చేసేసి ఇక ఎవరేమనుకున్న తర్వాత త్రివిక్రంతోనే సినిమాకి ప్లాన్ చేయనున్నాడట.
మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ తో చరణ్ ఇంతవరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. సినిమాలో కంటెంట్ తో పాటుగా మంచి మాటలతో మ్యాజిక్ చేయడంలో సిద్ధహస్తుడు త్రివిక్రం. అందుకే బన్నిని జులాయి, సన్నాఫ్ సత్యమూర్తిగా చూపించేశాడు.. చరణ్ ఎలాగైనా త్రివిక్రంతో సినిమా చేయాలని బాగా ప్రయత్నిస్తున్నాడు దీనికి పవన్ సపోర్ట్ కూడా దొరకడంతో ఇక దాదాపు సినిమా కన్ఫాం అయినట్టే. మరి చరణ్ కోసం పవన్ చేస్తున్న ఈ త్యాగం బదులుగా చరణ్ నిర్మాతగా పవన్ కళ్యాన్ తో ఓ సినిమాకు రంగం సిద్ధ చేస్తున్నారట. మరి ఇచ్చి పుచ్చుకుంటున్న బాబాయ్ అబ్బాయ్ ల వ్యవహారం చూసి మెగా ఫ్యాన్స్ అంటా భలే ముచ్చటపడుతున్నారు.