పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీని పూర్తి స్థాయి రాజకీయపార్టీగా గుర్తిస్తున్నట్లు తెలంగాణా ఎన్నికల సంఘం బుదవారంనాడు ప్రకటించింది. పవన్ కళ్యాణ్ 2014, మార్చి 14న జనసేన పార్టీని స్థాపించారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జనసేన అభ్యర్ధులను పోటీలో నిలబెట్టాలనుకొన్నప్పటికీ, దాని వలన రాష్ట్రంలో ఇంకా రాజకీయ అస్తిరత ఏర్పడుతుందని ఆ ఆలోచనను విరమించుకొని ఎన్డీయే అభ్యర్దులకు మద్దతు ఇచ్చేరు. ఎన్నికల తరువాత అయినా జనసేన పార్టీ నిర్మాణం మొదలుపెడతారని చాలా మంది భావించినప్పటికీ, సినిమా షూటింగులతో తీరిక లేనందున పవన్ కళ్యాణ్ ఇంతవరకు పార్టీ నిర్మాణం చేసుకోలేదు. అయినప్పటికీ ప్రజలలో ఆయనకున్న విశేషాధరణ వలన ఆయన రాజకీయ కార్యక్రమాలకి మరే ఇతర రాజకీయ నేతకు లేనంతగా ప్రజలు స్వచ్చందంగా తరలి వస్తుంటారు. అలాగే ఆయన మాటలకు రాజకీయాలలో చాలా ప్రాముఖ్యత ఉంది. తెలంగాణాలో ఆయన పార్టీకి గుర్తింపు వచ్చింది కనుక త్వరలో జరుగనున్న జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో జనసేన అభ్యర్ధులను నిలబెట్టవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.