సింగపూర్ టెన్నిస్ టోర్నీలో రష్యా క్రీడాకారిణి మరియా షరపోవా మునుపటి ఫామ్ తో దూకుడు ప్రదర్శిస్తోంది. డబ్ల్యు టి ఎ టోర్నీలో టాప్ సీడ్ సిమోనా హాలెప్ పై వరుస సెట్లలో విజయం సాధించింది. ప్రత్యర్థి గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నించినా షరపోవా పవర్ కు తలవంచక తప్పలేదు.
మొదటి సెట్ ను 6-4 స్కోరుతో షరపోవా కైవసం చేసుకుంది. రెండో సెట్లో అయినా షరపోవా జోరును అడ్డుకోవడానికి సిమోనా విశ్వ ప్రయత్నం చేసింది. కానీ రష్యా స్టార్ టెక్నిక్, పవర్ ముందు నిలవలేక పోయంది. రెండో సెట్ ను కూడా షరపోవా 6-4తో గెల్చుకుంది.
గత రెండు మూడు నెలలుగా షరపోవా ఫామ్ విషయంలో ఇబ్బంది పడుతోంది. కాలి గాయంతో టోర్నీ నుంచి తప్పుకోవడం, ఫాం లేమి కారణంగా పరాజయాలు ఎదుర్కోవడం అభిమానులను నిరాశ పరిచింది. సింగపూర్ టోర్నీ కోసం ఫిట్ నెస్ పెంచుకుంది. ఒకప్పటి ఫామ్ తో పోటీకి దిగింది. ఈ టోర్నీలో అభిమానులను అలరిస్తూ అద్భుత విజయాలను సాధించే అవకాశాలున్న వారిలో షరపోవా ఒకరు. కెరీర్ ఆరంభంలోనే ప్రతిష్టాత్మక వింబుల్డన్ చాంపియన్ షిప్ సాధించిన షరపోవా, ఇప్పుడు మరోసారి పూర్వ వైభవం పొందాలని తహతహలాడుతోంది.