హైదరాబాద్: ఒకప్పుడు తెలంగాణలో ఉన్న రియల్ ఎస్టేట్ బూమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్థభాగంలో భూముల రిజిస్ట్రేషన్‌నుంచి వచ్చే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, గత ఏడాదితో పోలిస్తే 37.51 శాతం పెరిగింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఆదాయం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెరుగుతూనే ఉంది. భూములు, స్థిరాస్తుల లావాదేవీలు ఉన్నట్లుండి పెరగటంవల్లే ఈ మార్పు చోటుచేసుకుందని అధికారులు చెబుతున్నారు.
ఏపీ నూతన రాజధానిని కృష్ణా, గుంటూరు జిల్లాలమధ్య ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించగానే ఆ రెండు జిల్లాలలో ఏర్పడిన రియల్ ఎస్టేట్ బూమ్ ఇప్పుడు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకుకూడా విస్తరించింది. భూముల రిజిస్ట్రేషన్‌లనుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఈ ఏడాది మొదటి అర్థభాగం ముగిసేనాటికి రు.1,809.45 కోట్లు ఉంది. ఇది గత ఏడాది ఇదే కాలానికి రు.1,315.87 కోట్లు మాత్రమే ఉండటం విశేషం. తూర్పుగోదావరిజిల్లానుంచి అత్యధికంగా రు.321.4 కోట్ల ఆదాయం వచ్చింది. రిజిస్ట్రేషన్‌లకు డిమాండ్ పెరగటంతో రాష్ట్ర ప్రభుత్వం పలు పట్టణాలు, నగరాలలో భూమి మార్కెట్ విలువను పెంచింది.
నూతన రాజధాని అమరావతిని విజయవాడ-గుంటూరు మధ్య ఏర్పాటుచేయాలని నిర్ణయించటంవలనే కోస్తాలోని మధ్యస్థ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పెరిగాయని చెబుతున్నారు. ఈ ఒక్క ప్రాంతంలోనే భూముల లావాదేవీలు 24 శాతం పెరిగాయి. అన్ని జిల్లాలలోనూ లావాదేవీలు పెరుగుతన్నాయని రెవెన్యూ డిపార్ట్‌మెంట్ వర్గాలు చెబుతున్నాయి. పారిశ్రామికవేత్తలు అనంతపూర్, చిత్తూరు జిల్లాలపై దృష్టి పెట్టారని, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలలో గృహ అవసరాలకోసం బూమ్ ఏర్పడిందని పేర్కొంటున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి పట్టణాలలో భారీ హౌసింగ్ ప్రాజెక్ట్‌లు చేపట్టటంకోసం ఢిల్లీ, ముంబాయి, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలనుంచి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు రంగంలోకి దిగాయి. ఇప్పటివరకు హైదరాబాద్ నగరానికే పరిమితమైన పలు బడా సంస్థలుకూడా ఇప్పుడు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంపై దృష్టిపెడుతున్నాయి. ఈ రెండు నగరాలలో హైఎండ్ విల్లాలు, ఇండిపెండెంట్ ఇళ్ళకు బాగా గిరాకీ ఉంది.
ఏది ఏమైనా అమరావతిలో రాజధాని ఏర్పాటు వలన రాష్ట్రంలో ఎక్కువగా లాభపడుతోంది విజయవాడ నగరమే. రాష్ట్రం మొత్తంలో అత్యధికంగా ప్రభుత్వ – ప్రైవేట్ లావాదేవీలు, వ్యాపారం విజయవాడలోనే జరుగుతోంది. దానితో పోల్చుకుంటే గుంటూరు నగరం చాలా వెనకబడి ఉంది. మరోవైపు హైదరాబాద్ నుంచి 20,000 మంది ప్రభుత్వోద్యోగులు తమ కుటుంబాలతో సహా తరలిరానున్నందున విజయవాడ నగరంలో రియల్ వ్యాపారం మరిన్ని రెట్లు పెరగనుంది. ప్రస్తుతం ఇక్కడ గ్రూప్ హౌసింగ్, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఏర్పడింది. గన్నవరం ఎయిర్‌పోర్ట్ సమీపంలో 20 అంతస్తుల రెసిడెన్షియల్ టవర్ ప్రాజెక్ట్ నిర్మాణం ఇటీవల ప్రారంభమయింది. కంచికచర్ల ప్రాంతంలో సుమారు 100 హౌసింగ్ ప్రాజెక్టులు వివిధ నిర్మాణ దశలలో ఉన్నాయి. మంగళగిరి ప్రాంతంలో ఒక బహుళ అంతస్తుల హౌసింగ్ ప్రాజెక్ట్ ప్రారంభించటానికి హైదరాబాద్ నగరానికి చెందిన ఒక బడా రియల్ సంస్థ ఇటీవల సన్నాహాలు చేస్తోంది. విశాఖపట్నంలోకూడా పెందుర్తి, ఉప్పాడ, మధురవాడ, సింహాచలం ప్రాంతాలలో సుమారుగా 150 రెసిడెన్షియల్ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.