ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ ఇవ్వాళ్ళ ఒకేసారి 8మంది మంత్రులను తన మంత్రివర్గంలో నుంచి తొలగించారు. మరో 9 మంది మంత్రుల శాఖలను వెనక్కి తీసేసుకొన్నారు. ఇంకో 9 మంది మంత్రుల చేతిలో ఉన్న కొన్ని శాఖలను కూడా వెనక్కి తీసుకొన్నారు. గత ఏడాది కాలంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మత ఘర్షణలు, మైనార్టీ వర్గాల మీద దాడులు, ఆరాచకం, అవినీతి వంటి అవలక్షణాలు బాగా పెరిగిపోయినట్లు తరచూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈరోజు తొలగించిన మంత్రులలో కొందరు అసమర్ధులు కాగా మరికొందరు అవినీతికి పాల్పడుతున్నట్లు ముఖ్యమంత్రి గుర్తించి అందరినీ ఒకేసారి తొలగించేసి షాక్ ఇచ్చేరు. ఈసారి పార్టీలో సీనియర్లను, యువకులను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు సమాజ్ వాదీ పార్టీ నేతలు చెపుతున్నారు. మంత్రివర్గ ప్రక్షాళన పూర్తి చేసిన వెంటనే తన మంత్రివర్గంలో తీసుకోబోతున్న కొత్త మంత్రుల జాబితాను సిద్దం చేసి దానిని రాష్ట్ర గవర్నర్ రామ్ నాయక్ కి కొద్ది సేపటి క్రితం సమర్పించినట్లు తెలుస్తోంది. ఈనెల 31వ తేదీన ఉదయం 10.30 గంటలకు రాజ్ భవన్ లో కొత్త మంత్రుల చేత గవర్నర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు.