ఈ దేశానికి ఏమైందీ? పాలన ఎందుకింతగా భ్రష్టుపట్టింది ? ఒక్కొక్క రచయిత తాను ఎంతో గౌరవంగా అందుకున్న పురస్కారాలను తిరిగి ఇచ్చేయాలని ఎందుకనుకుంటున్నారు ? కళాకారులు, సినీనిర్మాతలు అదే బాట ఎందుకు తొక్కుతున్నారు? ఎందుకని శాస్త్రవేత్తలు పద్మభూషణ్ అవార్డులను తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నారు ? కేవలం వీరంతా `ఒకే భావజాలం’ ఉన్నవారని సరిపెట్టుకోవాలా? లేక పాలకుల్లో సమభావం లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుందని భావించాలా?
దేశంలో మేధావులు మండిపడుతున్నారు. రచయితలు, కళాకారులు, చిత్రనిర్మాతలు, శాస్త్రవేత్తలు ఇలా ఒకరివెంట మరొకరు తమ నిరసన గళం విప్పుతున్నారు. దేశంలో భ్రష్టుపట్టిన వాతావరణం ఏర్పడిందని ముక్తకంఠంతో ఎలుగెత్తుతున్నారు. 53మంది చరిత్రకారులు, (వీరిలో బాగా పేరుబడ్డ రొమిల థాపూర్, ఇర్ఫాన్ హాబిబ్, కెఎన్ పన్నికర్, మిృదుల ముఖర్జీ వంటి వారు కూడా ఉన్నారు) సంయుక్త ప్రకటనద్వారా తమ నిరసన తెలియజేశారు. ఉత్తరప్రదేశ్ లోని దాద్రి దాడి సంఘటనను వారు ప్రధానంగా ప్రస్తావించారు. గోవధకు పాల్పడ్డారంటూ దాద్రీకి చేరువలోని ఒక గ్రామంలో అమానుషంగా దాడికిదిగిన సంఘటనపై ప్రధానమంత్రి మోదీ స్పష్టమైన ప్రకటన చేయకపోవడంపై మేధావులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, ఈమధ్య ముంబయిలో ఒక పుస్తకావిష్కరణ సభకు వెళుతున్న సుధేంద్ర కులకర్ణి ముఖంపై ఇంకుజల్లిన సంఘటనపట్ల కూడా దేశవ్యాప్తంగా మేధావుల నుంచి నిరసన పెల్లుబికింది.
ఒక్కొక్క రచయిత తమ అవార్డులను తిరిగి ఇచ్చేస్తుంటే పాలనా పగ్గాలందుకున్నవారు సరిగా స్పందిచకపోగా, ఈ నిరసనను కాగితం పులిగా అభివర్ణిస్తున్నారు. పైగా, మంత్రుల స్థాయిలో ఉన్నవారు `ఇలాంటి రాతలు రాయకం’డంటూ హుకుం జారీచేస్తుండటం విడ్డూరం. ఈ తాజా పరిణామం చరిత్రకారులను ఆందోళనకు గురిచేస్తున్నది. వీరిలో చాలామందికి తమ పుస్తకాలపై నిషేధం వేటుపడిన సందర్భాలున్నాయి. గతంలోని చేదుఅనుభవాలను దృష్టిలో పెట్టుకుని పరిస్థితి చేయిదాటిపోకుండా చక్కదిద్దే చర్యలో భాగంగా మేధావులు ఏకమవుతున్నారు.
మనది ప్రజాస్వామ్య దేశం. విభిన్న మతాల, ఆచారాల సమ్మేళనం ఇది. భావప్రకటన స్వేచ్ఛ ఉండాలి. అయితే ఈమధ్య జరిగిన సంఘటనలు అందుకు భిన్నంగా ఉన్నాయనీ, వాటిపై ప్రధాని మోదీ స్పందించకపోవడం శోచనీయమన్నది వీరి అభిప్రాయం. కాగా, శాస్త్రవేత్తలు కూడా ఇంచుమించు ఇదే ధోరణిలో ఉన్నారు. వీరిలో ముగ్గురు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలు (అశోక్ సేన్, పి.ఎం. భార్గవ, పి. బలరాం) కూడా ఉన్నారు. వీరు తమ పురస్కారాలను తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నారు.
లౌకిక రాజ్యంలో ఇలాంటి నిరసనగళం హర్షనీయమని చాలా మంది భావిస్తున్నప్పటికీ, ఇలా నిరసన వ్యక్తం చేస్తున్న వారంతా హిందూభావజాల వ్యతిరేకులనీ, హిందువుల ఓట్లను చీల్చడమే వీరి ధ్యేయమన్న విమర్శలున్నాయి. ఏకభావజాలమున్న వారంతా ఒక చోటచేరి నిరసన తెలిపినంతమాత్రాన అది పెద్ద సమస్యకాబోదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై జాతీయ ఛానెళ్లలో చర్చలు జరుగుతున్నాయి. విభిన్నవాదనలతో మొత్తానికి ఇదో హాట్ టాపిక్ మారిపోయింది. మేథో ప్రకంపనలు ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయో, ఇవి చివరకు ఎటు దారితీస్తాయో చూడాలి.
– కణ్వస