హైదరాబాద్: కేసీఆర్ కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్న సమయంలో సహారా గ్రూప్‌కు నిబంధనలకు విరుద్ధంగా పీఎఫ్ ఖాతాలు సొంతంగా నిర్వహించుకోవటానికి అనుమతులిచ్చారంటూ ఆంధ్రజ్యోతి నిన్న ప్రచురించిన కథనంపై ఊహించినట్లే టీఆర్ఎస్ పార్టీ, వారి పత్రిక నమస్తే తెలంగాణ నిప్పులు చెరిగాయి. మరోవైపు ఆంధ్రజ్యోతి పత్రిక నిన్నటి కథనానికి రెండో భాగాన్ని ఇవాళ ప్రచురించింది. ఈ కుంభకోణం విలువ రు.7,255 కోట్లని, 11 లక్షలమంది ఈ కుంభకోణంవలన బాధితులుగా మారారని పేర్కొంది.
నమస్తే తెలంగాణ పత్రిక రెచ్చిపోయింది. ఆంధ్రజ్యోతి కథనంపై నిప్పులు కక్కుతూ మొదటి పేజిలోనే ఒక ఆర్టికల్‌ను ప్రచురించింది. ఒక బాధ్యతాయుతమైన పత్రిక రాయకూడని పదజాలాన్ని ఉపయోగిస్తూ ఆంధ్రజ్యోతి పత్రికను, ఆ పత్రిక ఎండీ రాధాకృష్ణను తిట్టిపోసింది. ‘అబద్ధాల జ్యోతి… అడ్డగోలు కూతలు’ అనే హెడ్డింగ్ పెట్టి, రాధాకృష్ణకు ఉన్మాదం పరాకాష్ఠకు చేరిందని, పిచ్చి పీక్కు చేరిందని రాసింది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు అని సామెత ఉందని, కానీ ఇక్కడ ఎలుక కాదు దాని విసర్జితంకూడా రాధాకృష్ణకు చిక్కలేదని విమర్శించారు(ఈ భాషతో నమస్తే తెలంగాణ తెలుగు పత్రికారంగంలో కొత్త ప్రమాణాలకు తెరతీసినట్లయింది). గతంలో తార-సితార వంటి కొన్ని సి గ్రేడ్ పత్రికలలో ఇలాంటి భాషను ఉపయోగించేవారు. నమస్తే తెలంగాణ పత్రిక ఆ భాషనే ఇప్పుడు వాడుతోంది.
కేసీఆర్ ఏ తప్పూ చేయలేదని, నిబంధనలకు అనుగుణంగానే సహారాకు అనుమతులిచ్చారని నమస్తే తెలంగాణ వివరణ ఇచ్చింది. వందమందికిపైగా కార్మికులు ఉన్న కంపెనీలు పీఎఫ్ కాతాలను సొంతంగా నడుచుకోటానికి ఈపీఎఫ్ చట్టంలో 16/ఏ ఉపనిబంధన కింద అనుమతి ఇవ్వొచ్చని పేర్కొంది. ఇది బాగానే ఉంది. తప్పేదో, రైటోదో చర్చించటం సమర్థనీయం. కానీ అసభ్య పదజాలం ఉపయోగించటం ఎంతవరకు సబబో ఆ పత్రిక ప్రస్తుత ఎడిటర్ కట్టా శేఖరరెడ్డే చెప్పాలి. అన్నట్లు ఈ శేఖరరెడ్డి మొన్నటిదాకా ఆంధ్రజ్యోతిలోనే చేసొచ్చారు.
మరోవైపు టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్ కూడా రాధాకృష్ణపై రెచ్చిపోయారు. రాధాకృష్ణ తిన్నా, పన్నా, లేచినా కేసీఆర్ మీదనే రాస్తుంటడని మండిపడ్డారు. నిన్న కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లిలో ఆదర్శ పాఠశాల, హాస్టల్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ, ఆ నీచ్ కమీన్ కుత్తేగాడు ఓ దగుల్బాజీ అని, తెలంగాణ బాగుపడుతుంటే చూడలేడని మండిపడ్డారు.