దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగమ్మాయి అనూహ్య హత్య కేసులో ఈరోజు ముంబై కోర్టు తుది తీర్పు వెలువరించింది. ముంబైలోని టి.సి.ఎస్. కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న అనూహ్య 2013 డిశంబర్ లో క్రిస్మస్ పండుగ జరుపుకొనేందుకు తన స్వస్థలమయిన కృష్ణా జిల్లాలో మచిలీపట్నం వచ్చింది. మళ్ళీ 2014 జనవరి 5న ముంబై తిరిగి వెళ్ళింది. ముంబై కుర్లా సెంట్రల్ స్టేషన్లో ఆమె దిగినప్పుడు నాసిక్ కి చెందిన చంద్రభాన్ అనే వ్యక్తి టాక్సీ డ్రైవర్ గా పరిచయం చేసుకొన్నాడు. నిజానికి అతని వద్ద టాక్సీ లేదు. అతను టాక్సీ డ్రైవర్ కాదు. టాక్సీని కొంచెం దూరంగా పార్క్ చేశానని చెప్పాడు. అతని మాటలు నమ్మిన అనూహ్య అతని బైక్ పై కూర్చోవడంతో ఆమె జీవితం విషాదాంతం అయింది. చంద్రభాన్ మొదట ఆమె వస్తువులను మాత్రమే దోచుకోవాలనుకొన్నాడు. ఆమెను తన బైక్ పై కూర్చోబెట్టుకొని ఒక నిర్జన ప్రదేశానికి తీసుకొని వెళ్ళిన తరువాత అతనిలో మానవ మృగం మేల్కొంది. ఆమెపై అత్యాచారం చేసి, ఆ తరువాత ఆమెను అతికిరాతకంగా హత్యచేసాడు. ఆమె వస్తువులను దోచుకొని తరువాత పెట్రోల్ పోసి ఆమె శవాన్ని తగులబెట్టాడు.
అనూహ్య నుండి ఫోన్ కాల్స్ రాకపోవడంతో ఆందోళన చెందిన ఆమె తండ్రి ముంబై వెళ్లి పోలీసులకు పిర్యాదు చేసారు. కానీ వారు కేసు నమోదు చేసుకోవడానికి నిరాకరించారు. చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి కేంద్ర హోం మంత్రి సుషీల్ కుమార్ షిండేకు ఈ కేసు విషయమై పోలీసుల చేత విచారణ జరిపించమని కోరుతూ లేఖ వ్రాయవలసి వచ్చింది. షిండే నుంచి ఆదేశం వచ్చిన తరువాతనే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టి చివరికి చంద్రభాన్ అనూహ్యపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు కనుగొన్నారు. సుమారు రెండేళ్ళు పైగా సాగిన ఈ కేసులో ఈరోజు ముంబై కోర్టు తుది తీర్పు వెలువరించింది. అనూహ్యపై అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా హత్య చేసినందుకు కోర్టు అతనికి ఉరి శిక్ష విధించింది. ఇంత తీవ్రమయిన నేరం చేసిన చంద్రభాన్ కి ఉరి శిక్ష విధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. కానీ అతను కోర్టు తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేయవచ్చును. ఆ తరువాత రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరవచ్చును. బహుశః మరో ఒకటి రెండు సంవత్సరాలు ఈ కేసు కొనసాగుతుందేమో?