హైదరాబాద్: అలనాటి ప్రముఖ క్రికెటర్, పాకిస్తాన్ రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ రెండో పెళ్ళికూడా పెటాకులయింది. పదినెలల క్రితం చేసుకున్న పెళ్ళి విడాకులదిశగా సాగుతోంది. ఇమ్రాన్, ఆయన (రెండో) భార్య రెహమ్ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలనుకుంటున్నారని ఆయన ప్రతినిధి హక్ వెల్లడించారు. ఇది సున్నితమైన విషయంకాబట్టి మీడియా దీనిపై ఊహాగానాలు చేయొద్దని, ఇంతటితో ఈ వ్యవహారాన్ని ఆపేయాలని అభ్యర్థించారు. విడిపోవటానికి నిశ్చయించుకున్నట్లు రెహమ్ ఇవాళ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ కూడా దీనిపై ట్విట్టర్లోనే స్పందిస్తూ రెహమ్ అంటే తనకెంతో గౌరవం ఉందని, తమ ఇద్దరి ప్రైవసీని గౌరవించమని కోరారు.
మరోవైపు, రెహమ్ ఇంట్లో కూర్చోవటానికి ఇష్టపడటంలేదని, రాజకీయాలలో చురుకుగా పాల్గొనాలనుకుంటోందని, అందుకే ఇద్దరిమధ్యా విభేదాలు ఏర్పడ్డాయని పాక్ మీడియాలో కొన్ని నెలలుగా వార్తలొస్తున్నాయి. 63 ఏళ్ళ ఇమ్రాన్‌కు పెళ్ళి విడాకులకు దారితీయటం ఇది రెండోసారి. మొదటి భార్య జెమీమాతో ఆయన 2004లో విడాకులు తీసుకున్నారు. అసలు ఇమ్రాన్ పెళ్ళి చేసుకోవటమే 43 ఏళ్ళ వయసులో చేసుకున్నారు. జెమీమా, రెహమ్ ఇద్దరూ బ్రిటన్ దేశస్థులే.