బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అసెంబ్లీ ఎన్నికలలో నరేంద్ర మోడీని నిలువరించేందుకు లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతిపరుడని తెలిసి ఉన్నప్పటికీ ఆయనతో చేతులు కలిపారు. కానీ సరిగ్గా అదే కారణం చేత ఆయనకు పడవలసిన ఓట్లు కాస్తా బీజేపీకి పడుతున్నట్లు సమాచారం. మంచి సమర్ధుడు, ఎటువంటి మచ్చలేనివాడు, బిహార్ రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలోకి నడిపించినవాడు అని నితీష్ కుమార్ కి ప్రజలలో మంచి పేరుంది. కానీ అవన్నీ చూసి జనతా పరివార్ కూటమికి ఓటేస్తే లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ లో మళ్ళీ తన ఆటవికరాజ్యం స్థాపించడం తధ్యమని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. అది ప్రజలకు సరిగ్గానే చేరుతోంది. ఒకవేళ జనతా పరివార్ ఎన్నికలలో గెలిచినట్లయితే నితీష్ కుమార్ మళ్ళీ ముఖ్యమంత్రి అయినప్పటికీ, లాలూ ప్రసాద్ యాదవ్ వెనుక సీటులో కూర్చొని ప్రభుత్వాన్ని తనకు నచ్చినట్లుగా నడిపించుకొంటారని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. అందుకోసమే లాలూ ప్రసాద్ తన ఇద్దరు కొడుకులను ఎన్నికలలో పోటీ చేయించారని బీజేపీ నేతలు వాదిస్తున్నారు.
నితీష్ కుమార్ వారి వాదనను ఔనని, కాదని అనలేకపోతున్నారు. ఎందుకంటే నితీష్ కుమార్ తనతో సరి సమానంగా లాలూ ప్రసాద్ యాదవ్ కి వంద సీట్లు పంచి ఇచ్చేరు. కనుక ఆయన మాట కాదని నితీష్ కుమార్ ఇదివరకులాగా స్వేచ్చగా తనకు నచ్చినట్లుగా పరిపాలన చేయలేరు. కనుక ఎన్నికలలో గెలిచినా ఐదేళ్ళపాటు లాలూ ప్రసాద్ యాదవ్ తో తిప్పలు తప్పవు, ఓడిపోయినా లాలూ ప్రసాద్ యాదవ్ తో చేతులు కలిపినందుకు ఐదేళ్ళ పాటు పశ్చాతాపపడక తప్పదు. అదే నితీష్ కుమార్ ఈ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి ఉండి ఉంటే ఆయనకే విజయావకాశాలు ఎక్కువగా ఉండేవేమో?