ఆర్ధిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలకు తెలంగాణా ప్రభుత్వం రూ. 1.50 లక్షలు పరిహారంగా ఇస్తోంది. దానిని రూ. 6 లక్షలకు పెంచుతూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది జూన్ 2 నుంచి అంటే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటి నుండి రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలకు ఆరు లక్షల పరిహారం అందజేస్తామని ఉత్తర్వులలో పేర్కొంది. ఇంతకు ముందు రూ. 1.50 లక్షల పరిహారం పుచ్చుకొన్నవారందరికీ కూడా మిగిలిన మొత్తం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణా ప్రభుత్వం ప్రతిపక్షాల ఒత్తిడికి లొంగో లేకపోతే మానవతా దృక్పధంతోనో ఉదారంగా ఈ ఆర్ధిక సహాయం అందజేస్తోంది. అయితే దీని వలన సమస్య తగ్గకపోగా మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. ఆర్ధిక సమస్యల నుంచి ఇక ఎన్నటికీ బయటపడలేమనే నిరాశతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. తాము బ్రతికున్నా తీర్చలేని ఆర్ధిక సమస్యలన్నీ తాము చనిపోతే తప్పకుండా తీరుతాయనే నమ్మకం ప్రభుత్వమే రైతులకు కల్పించినట్లవుతుంది. తాము చనిపోవడం వలన తమ భార్య, పిల్లలయినా సుఖంగా ఉంటారనే ఆశతో అటువంటి ఆలోచన లేని రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకొనే ప్రమాదం ఉంది. నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులకు ప్రభుత్వం పెంచిన ఈ పరిహారాన్ని పొందాలని ఆశపడితే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉంది.
కనుక రైతులు చనిపోయిన తరువాత వారి కుటుంబాలను ఆదుకోవడమనే ఆలోచన మానుకొని వారు చనిపోకుండా ఏవిధంగా కాపాడుకోవాలని ఆలోచిస్తే బాగుంటుంది. ప్రభుత్వం చేతిలో సమర్ధులు, నిజాయితీపరులు, తెలివయిన అధికారులున్నారు. తెరాసకు రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో కూడా బలమయిన క్యాడర్ ఉంది. ప్రభుత్వం చేతిలో డబ్బు, అధికారం అన్నీ ఉన్నాయి. కనుక ఈ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి, దాని ద్వారా నిస్సహాయ రైతులను ఆదుకొనే ప్రయత్నాలు చేయడం మంచి పద్ధతి. అవసరమయితే అందుకు కార్పోరేట్ సంస్థలు, స్వచ్చంద సంస్థలు, పారిశ్రామికవేత్తల సహాయ సహకారాలు కూడా కోరవచ్చును. రైతులను ఏదోవిధంగా కాపాడుకొనేందుకే ఆలోచించాలి, ప్రయత్నించాలి తప్ప చనిపోయిన తరువాత పరిహారం చెల్లించాలనే ఆలోచన సరయినది కాదు. దాని వలన ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు కూడా.