ముందు గుంటూరు ప్రకాశం జిల్లాల్లో, మొన్న కర్నూలు జిల్లాలో, నిన్న వరంగల్ జిల్లాలో, ఇపుడు పంజాబ్ రాష్ట్రంలో,పదేళ్ళుగా దేశమంతటా… విచ్చకుంటున్న పత్తిమొగ్గల నుంచి విరుచుకు పడుతున్న పురుగులు పంటను తినేసి రైతుల ఆత్మహత్యకు ఒక కారణమౌతున్నాయి.
”అధికదిగుబడుల”కోసం ప్రపంచ వ్యాప్తంగా శ్రేష్టమైన వంగడాలను అంతర్జాతీయ పరిశోధనా సంస్ధలు సేకరించి సంకరపరచిన జెనెటికల్లీ మోడిఫైడ్ (జి ఎమ్) విత్తనాల వాడకం మనదేశంలో పదేళ్ళ నుంచీ ఉధృతమౌతోంది. దిగుబడులు పెరిగిన మాట వాస్తవమే కానీ, జిఎమ్ విత్తనాలు, వాటినుంచి వంగడాల్లోకి పాకపోయే బిటి (బాసిలస్ తురింజెన్సిస్) ఒక జీవ రసాయనం. ఇదే, పంట పాలిట, భూమిపాలిట, రైతు పాలిట విషమైపోతోంది.
ఈ విషరసాయన ప్రభావం ఇపుడు పంజాబ్ లో ఇంతకుముందెన్నడూ లేనంత తీవ్రరూపం దాల్చినట్టు వార్తలు వస్తున్నాయి.పంజాబ్ లో కూడా బిటి‘ పత్తి పంట మొదట్లో బాగా పండింది. ఆ తరువాత సమస్య మొదలైంది. గతంలో లేని రకరకాల ‘క్రిములు’ బిటి పంటపై దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయి. ప్రస్తుతం పంజాబ్లో తెల్లటి ఈగలు పత్తి మొక్కలపై దాడులను ప్రారంభించాయి.
పంజాబ్లో 12 లక్షల ఎకరాలలో ఈ ఏడాది ‘బిటి’ పత్తి పంట వేశారు.పత్తిమొక్కలు ఏపుగా ఎదిగి కాయలు కాచే సమయంలో ఈ ‘తెల్ల పురుగులు’ అకస్మాత్తుగా పత్తిమొక్కలపై ప్రత్యక్షమై ఆకులను పిందెలను కాయలను నమిలి మింగేస్తున్నాయి! ఫలితంగా ఎనిమిది లక్షల ఎకరాలలోని పత్తిపంట సమూలంగా నాశనమై పోయింది. 200 కోట్ల రూపాయల ‘పురుగుల మందుల’ను వాడినప్పటికీ తెల్ల ఈగలు మాత్రం నశించలేదు. ఫలితంగా ఎనిమిది లక్షల ఎకరాలలోని రైతులకు నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లింది!
పంజాబ్ ప్రభుత్వం ఆరు వందల నలభయి కోట్ల రూపాయల పరిహారం మాత్రం అందచేయాలని నిర్ణయించడంతో పత్తి రైతులు భారీ ఎత్తున రాష్టమ్రంతటా నిరసన ఉద్యమాలు చేస్తున్నారు.అనేకమంది పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
బిటి పత్తి మన వ్యవసాయ రంగాన్ని దివాలా తీయించడానికై మొదలైన మల్టీ నేషనల్ కంపెనీల వ్యాపారంలో భాగం! ‘జిఎమ్’-జన్యుపరివర్తన-సాంకేతిక విజ్ఞానం ద్వారా తయారయిన అన్నిరకాల ‘బిటి’ విత్తనాలను వంగడాలను అనేక సంపన్నదేశాలు ఇప్పటికే నిషేధించాయి. ఎందుకంటే ‘బిటి’ అన్న రసాయనం నిజానికి ‘జీవ విషం’! ఈ రసాయనం మొక్కలలో ఉత్పత్తి కావడంవల్ల పంట దిగుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయని విత్తనాల తయారీ సంస్ధలు నమ్మబలికాయి.! కానీ ఈ పంటలను ఆహారంగా తీసుకున్నవారు చిత్ర విచిత్ర వ్యాధులకు క్రమంగా గురి అవుతారన్నది వ్యవసాయ విజ్ఞాన నిపుణులు తేల్చిన నిజం.
ఈ విత్తనాల ద్వారా వంగడాల ద్వారా పెరుగుతున్న మొక్కలకు ఎలాంటి ‘తెగులు’ ఏర్పడదన్నది జరిగిన ప్రచారం! కానీ రెండు మూడేళ్ల తరువాత కొత్తరకం పురుగులు, క్రిములు పుట్టుకుని వచ్చి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. పంజాబ్ పొలాలే ఇందుకు తాజా సాక్ష్యం.
పత్తిని పండించిన తరువాత వేరుసెనగ విత్తనాలు వేసినపుడు వేరుశనగ వేరునుండీ కుళ్లిపోవడం తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైతుల అనుభవం.కానీ మరికొన్ని ఏళ్ల తరువాత బిటి పంటల భూమిలో బిటి విత్తనాలు కూడా పంట కూడా పండదని, భూమి వ్యవసాయానికి పనికిరాని చవుడు దిబ్బగా మారిపోతుందని అంతర్జాతీయ వ్యవసాయ విజ్ఞానవేత్తలు చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు!
ఇటీవల మహబూబ్నగర్, కర్నూలు, వరంగల్ జిల్లాలలో సైతం బిటి పత్తి పురుగుపాలు కావడం గురించి వార్తలు వచ్చాయి. పంజాబ్ రాష్ట్రంలో, ఆస్ట్రేలియా దేశంలోను ‘జిఎమ్’-బిటి-పంటల కారణంగా భూ గర్భజలాలు ఇంకిపోయి, పరిసరాలు, పర్యావరణం కాలుష్య ప్రమాదానికి గురి అవుతాయని ఈ రంగంలో స్వచ్ఛందంగా కృషి చేస్తున్న బ్రిటన్ యువరాజు చార్లెస్ నాలుగేళ్ళ క్రితమే హెచ్చరించాడు.పంజాబ్లో ఇప్పుడీ హెచ్చరికలు నిజమయ్యాయి. కొత్త రకాల పురుగులు దాడి చేసాయి. నష్టపోయిన రైతులు అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్యలు చేసుకున్నారు.
దేశ ఆర్ధిక వ్యవస్ధనీ, వ్యక్తుల జీవితాలనీ ధ్వంసం చేసే ప్రకృతి వైపరీత్యాలకంటే, తీవ్రవాద చర్యలకంటే ”బిటి” వంగడాల బీభత్సం తక్కువేమీకాదు. అయినా, ఇదొక మహావిలయమని గుర్తించకపోవడం, గుర్తించినా పట్టించకోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాక్షసత్వం…ఇదే పెద్ద జాతీయ వైపరీత్యం.