తెలంగాణా ఉద్యమాలలో చాలా కీలకపాత్ర పోషించిన హరీష్ రావుకి తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత ఊహించినట్లుగానే కీలకమయిన మంత్రి పదవి లభించింది. ఆయనతో బాటు కేసీఆర్ కుమారుడు కె. తారక రామారావుకి కూడా కీలకమయిన మంత్రి పదవి లభించింది. కానీ ఆ తరువాత పార్టీలో, ప్రభుత్వంలో కెటిఆర్ క్రమంగా పైకి ఎదుగుతుంటే, హరీష్ రావు ప్రాధాన్యత తగ్గసాగింది. అంతకు ముందు పార్టీకి సంబంధించిన ఏ విషయంపైనైనా హరీష్ రావు స్పందిస్తూ ఉండేవారు. ఇప్పుడు పార్టీ తరపున, ప్రభుత్వం తరపునా కూడా మంత్రి కె. తారక రామారావే మాట్లాడుతున్నారు. ఆయనే తెరాస ప్రభుత్వం తరపున డిల్లీకి, ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళుతున్నారు. ఒకప్పుడు హరీష్ రావు నిత్యం మీడియాలో కనిపించేవారు కానీ ఇప్పుడు ఏదో ఒక సందర్భంలో తప్ప పెద్దగా కనబడటం లేదు. ఇప్పుడు ఆయన స్థానంలో మంత్రి కేటిఆర్ దర్శనమిస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమారుడు కె. తారక రామారావుని పార్టీకి, ప్రభుత్వానికి తన వారసుడుగా ముందుకు తీసుకువచ్చేందుకే హరీష్ రావుకి ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపరుతున్నారు. ఆ విషయం వరంగల్ ఉప ఎన్నికల సందర్భంగా మరొక్కమారు బయటపడిందని వారు అభిప్రాయపడుతున్నారు.
కడియం శ్రీహరి వరంగల్ లోక్ సభ సీటుని ఖాళీ చేసిన తరువాత అక్కడి నుండి హరీష్ రావు అనుచరుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ పోటీ చేయాలని చాలా ఉబలాటపడ్డారు. హరీష్ రావు సూచన మేరకే ఆయన తరచూ వరంగల్ నియోజక వర్గంలో పర్యటిస్తూ, స్థానిక తెరాస నేతలతో సత్సంబంధాలు నెలకొల్పుకొన్నారు. స్థానిక నేతలు కూడా శ్రీనివాస్ అభ్యర్ధిత్వం పట్ల ఎటువంటి వ్యతిరేకత కనబరచలేదు. అతను తన మేనల్లుడు హరీష్ రావు అనుచరుడని, వరంగల్ సీటు ఆశిస్తున్నాడని ముఖ్యమంత్రి కేసీఆర్ కి కూడా తెలుసు కానీ అతను స్థానికుడు కాడనే కారణంతో అతనిని పక్కన పెట్టేసి దయాకర్ పేరుని ఖరారు చేశారు.
హరీష్ రావు అనుచరుడు కనుకనే ఎర్రోళ్ళ శ్రీనివాస్ ని ముఖ్యమంత్రి పక్కన పెట్టేసారని తెరాస నేతలే గుసగుసలాడుకొంటున్నారుట. తద్వారా పార్టీలో నేతలందరికీ ఒక బలమయిన సంకేతం పంపినట్లు అయ్యిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపరుతున్నారు అయితే ఈ ఊహాగానాలను తెరాస నేతలు, హరీష్ రావు కూడా ఖండించవచ్చును. కానీ ఈ పరిణామాలన్నీ చూస్తుంటే హరీష్ రావు క్రమంగా పార్టీలో తన ప్రాధాన్యత కోల్పోయి ఒంటరివాడు అయినట్లు కనిపిస్తోంది.