హైదరాబాద్: ప్రస్తుత కాలంలో కార్పొరేటర్ లాంటి చిన్న ప్రజాప్రతినిధికూడా ఎస్‌యూవీలలో తప్పితే చిన్న కార్లలో తిరగటంలేదు. అలాంటిది ఆ మంత్రికి కారు సంగతి పక్కన పెట్టండి… కనీసం పక్కా ఇల్లుకూడా లేదు. ఆయన ఉండేది ఒక పూరిగుడిశెలో. ఆయనకున్న సేవింగ్స్ అంతా కలిపి రు.58,000 మాత్రమే. ఆయనను మంత్రి పదవి వరించింది.
బన్సీధర్ బౌద్ధ్ 2014 సెప్టెంబర్‌లో యూపీలోని బాలా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకప్పుడు చౌకీదార్‌గా పనిచేసిన బన్సీధర్, కొంతకాలం సైకిల్ పంచర్ షాప్ కూడా నడిపారు. ఎమ్మెల్యే అయిన తర్వాతకూడా సాధారణ జీవితాన్నే గడుపుతున్నారు. మోటార్ సైకిల్ మీద నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటారు. ఆయనకు ఐదుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు. ఇప్పటికీ తన 6 ఎకరాల పొలంలో పనిచేస్తూ ఉంటారు. ఉదయం 8 గంటలకు పొలం వెళ్ళి పొద్దు కుంకిన తర్వాత ఇంటికి రావటం తన దినచర్య అని చెబుతారు. తన పొలంలో వరి, చెరకు పండిస్తారు. అలాంటి బన్సీధర్కు, అనుకోకుండా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నిన్న జరిపిన భారీ మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి దక్కింది(ఇటీవల 8 మంది మంత్రులను ఒక్క వేటుతో ఇంటికి పంపించిన అఖిలేష్ నిన్న 12 మంది కొత్తవారిని మంత్రులుగా తీసుకున్నారు).
తనకు పెద్ద కలలేమీ ఉండవని, మంత్రి అవుతానని కలలోకూడా ఊహించలేదని బన్సీధర్ చెప్పారు. అయితే ఇప్పుడు మంత్రి అవటంతో తన నియోజకవర్గాన్ని, తనవారిని బాగా అభివృద్ధి చేయాలని కలలు కంటున్నానని అన్నారు. మంత్రి పదవిలో భాగంగా బన్సీధర్కు బుగ్గ కారు లభించనుంది. ఈ కారును తాను లక్నోకు తన ఊరికి మధ్య తిరగటానికి వాడుకుంటానని బన్సీధర్ చెప్పారు. తన ప్రాంతం బాగా వెనకబడినదని, 45 కిలోమీటర్లకు పైగా అడవులే ఉంటాయని, 50 కిలోమీటర్ల పరిధిలో ఒక్క కాలేజీకూడా లేదని తెలిపారు. మంత్రిగా ముందుగా నియోజకవర్గానికి ఏమి చేయాలనుకుంటున్నారని అడగగా, ఒక కాలేజిని తీసుకురావాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే దీనిగురించి ముఖ్యమంత్రిని అడిగానని తెలిపారు.