ఆంతరంగిక భద్రత విషయంగా విదేశాల నుంచి సహకారాన్ని పొందడంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యిపిఎ ప్రభుత్వం పూర్తిగా విఫలం కాగా, బిజెపి నాయకత్వంలోని ఎన్ డి ఎ ప్రభుత్వం విజయాలు సాధించడం మొదలు పెట్టింది. సోషల్ టెర్రరిస్టు చోటా రాజన్ ను పట్టుకోవడమే ఇందుకు తాజా సాక్ష్యం. దేశదేశాలను ప్రభావితం చేయగలిగిన ఈ ఘనత భారత ప్రధాని నరేంద్రమోదీకి, సుష్మాస్వరాజ్ సహా విదేశాంగ మంత్రిత్వ శాఖకే దక్కుతుంది .
ఆర్ధిక నేరస్ధులు, ఇటలీకి చెందిన ఒట్టావియో ఖత్రోచి, అమెరికాకు చెందిన వారెన్ ఆండర్సన్ లను విచారణకోసం మనదేశానికి తరలించుకొని రావడంలో గత ప్రభుత్వాలు విఫలం కావడానికి కారణం ఆయా దేశాల ప్రభుత్వాల సహకారాన్ని సాధించుకో లేకపోవడమే. టర్రరిస్టు గూండా దావూద్ ఇబ్రహీం లాంటి వారు పాకిస్తాన్‌లోను ఇతర దేశాలలోను సురక్షితంగా ఉండగలగడం మన ప్రభుత్వాల వైఫల్యం. హెడ్లే వంటి జిహాదీ దుండగులను మనదేశానికి తరలించడానికి అమెరికా వంటి మిత్ర దేశం సైతం అంగీకరించకపోవడం మన వ్యూహాత్మక వైఫల్యమే!
మోదీ ప్రధాని అయ్యాక ఐక్య అరబ్ ఎమిరేట్స్’ ప్రభుత్వం జిహాదీ హంతకులను భారతదేశానికి తరలించింది. ఈశాన్య భారతంలో విద్రోహకాండ సాగిస్తున్న టర్రరిస్టులను భారతసైనికులు బర్మాలోకి చొచ్చుకుపోయి కాల్చి చంపారు.ఇదంతా మోదీ ప్రభుత్వానికి వ్యూహాత్మక విజయమే!
ఛోటారాజన్ అనే రాజేంద్ర సదాశివ్ నిఖల్ జే బలి ద్వీపంలో ఇండొనేసియా భద్రతాదళాలవారు సోమవారం పట్టుగోగలిగారు. మన ప్రభుత్వ నేర పరిశోధన విభాగాలతో ఆస్ట్రేలియా, ఇండొనేసియా ప్రభుత్వాలు సహకరించడం వల్లనే ఛోటారాజన్ పట్టుబడ్డాడు. ఆస్ట్రేలియాలో అనేక ఎళ్లుగా రహస్య జీవితం గడిపిన ఛోటారాజన్ ఆ దేశం నుండి ఇండొనేసియాలోని బలి ద్వీపంలో అడుగు పెట్టిన తక్షణం పట్టుబడడం భారత ప్రభుత్వానికి లభించిన దౌత్య విజయం.
1993 వరకు దావూద్ ఇబ్రహీం అనుచరుడిగా దారుణమైన చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఛోటా రాజన్ ఆ తరువాత ఇబ్రహీం ముఠాకు దూరమైపోయాడు. అంతవరకు అసాంఘిక కలాపాలు మాత్రమే జరిపిన రాజన్ పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరితమైన 1993 జిహాదీ కాండను అంగీకరించకపోవడమే దావూద్ ఇబ్రహీంతో తెగతెంపులకు కారణమన్న కధనం వినబడుతోంది. అందువల్లనే ఇబ్రహీం వలె ఇతగాడు పాకిస్తాన్‌కు వెళ్లకుండా తూర్పు ఆసియా దేశాలలోను, ఆస్ట్రేలియాలోను కాలం గడిపాడు. 2000లో ఛోటా షకీల్ ముఠా జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఛోటా రాజన్ ఆ తరువాత బ్యాంకాక్‌లోని ఆసుపత్రి నుంచి అదృశ్యమైపోయాడు. థాయ్‌లాండ్ నుంచి పారిపోయాడు.
దావూద్ ఇబ్రహీం ముఠావారు తూర్పు ఆసియా దేశాలలో మాత్రమే కాక ఆస్ట్రేలియాలో సైతం ఛోటా రాజన్ కోసం వేటాడడం ఉభయుల ముఠాల ప్రాబల్యానిక సాక్ష్యం. ఇన్ని దేశాలలోను ఈ ప్రత్యర్థి ముఠాలకు చెందిన హంతకులు వుండటం వారి బలానికి, ప్రాబల్యానికి తార్కాణం. 2000లో బ్యాంకాక్‌లో గాయపడిన ఛోటా షకీల్ దావూద్ ముఠాను మాత్రమే కాక, థాయ్‌లాండ్ ప్రభుత్వ భద్రతా వ్యవస్థను సైతం ఏమరిచి పారిపోగలగడం అసాంఘిక శక్తుల పలుకుబడికి నిదర్శనం. అప్పటి నుంచి ‘బలి’లో పట్టుబడే వరకు దావూద్ ముఠావారు ఇతగాడిని మట్టుపెట్టడానికై విసుగు చెందకుండా యత్నిస్తూనే ఉన్నారు. ఇటీవల ఫిజీ దేశానికి వెళ్లిన రాజన్‌ను అక్కడే హతమార్చడానికి తాము యత్నించినట్టు, చివరికి ఆస్ట్రేలియాలో సైతం రాజన్ రహస్య స్థావరాలను తాము చట్టుముట్టినట్టూ షకీల్ ప్రకటించాడు.
ఈ దిగ్బంధం కారణంగానే ఏడేళ్లుగా ఉంటున్న ఆస్ట్రేలియాను వదలిపెట్టి ఛోటా రాజన్ ఇండొనేసియాకు పారిపోయాడు. తాము తరుమక పోతే రాజన్‌ను ఇండొనేసియా పోలీసులు అరెస్ట్ చేసేవారుకాదని షకీల్ చెబుతున్నాడు.
ఇలా దశాబ్దుల పాటు నేరస్థులు, హంతకులు, ఉగ్రవాదులు, విద్రోహులు, బీభత్సకారులు దేశవిదేశాలలో విచ్చలవిడిగా విహరించగలగడం అంతర్జాతీయ సమాజానికి అవమానకరం. కానీ అనేక ప్రజాస్వామ్య దేశాలలోకి సైతం ఈ అంతర్జాతీయ నేరస్థులు చొరబడగలుగుతున్నారు. మళ్లీ ఆ దేశాలనుండి ఇతర దేశాలలోకి సురక్షితంగా వెళ్లి రాగలుగుతున్నారు. ఆస్ట్రేలియాలో మోహన్ కుమార్ అన్న మారుపేరుతో ఏడేళ్లుగా గడిపిన ఛోటా రాజన్‌ను చివరికి భాతర సిబిఐ పసికట్టే వరకు ఆ దేశ ప్రభుత్వం కనిపెట్టనే లేదంటే విశ్వవ్యాప్తమౌతున్న అవినీతి, ప్రాణభయాల లోతుల్ని అర్ధం చేసుకోవచ్చు!