హైదరాబాద్: రష్యా విమానం క్రాష్ విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. విమానం కూల్చివేసింది తమేనని ప్రకటించిన తీవ్రవాద సంస్థ ఐసిస్, దానికి ఆధారంగా ఇవాళ ఒక వీడియోనుకూడా విడుదల చేసింది. అయితే ఈ వీడియో దృశ్యాలపై కూడా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
శనివారం ఈజిప్ట్ నుంచి సెయింట్ పీటర్స్బర్గ్ వెళుతూ విమానం కూలిపోయి 224 మంది చనిపోయారు. ఈ విమానాన్ని తామే పేల్చినట్లు ఐసిస్ ప్రకటించింది. అయితే ఆ ప్రకటనను ఈజిప్ట్, రష్యా కొట్టిపారేశాయి. ఆకాశంలో 30 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చివేసే ఆయుధాలు ఐసిస్ తీవ్రవాదుల వద్ద లేవని పేర్కొన్నాయి. సాంకేతిక కారణాలతోనే విమానం కూలిపోయిందని తెలిపాయి. దానికి బదులుగా ఐసిస్ ఇవాళ కూల్చివేత దృశ్యాలంటూ ఒక వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసింది. మిస్సైల్ సాయంతో విమానాన్ని కూల్చామని తీవ్రవాదులు పేర్కొన్నారు. సిరియాలో ఐసిస్‌పై రష్యా బాంబు దాడులకు ప్రతీకారంగా ఈ చర్యకు పాల్పడ్డమని ప్రకటించారు. అయితే అది గ్రాఫిక్సా, నిజమైన దృశ్యాలా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు విమాన ప్రమాదానికి కారణాలను తెలుసుకునే క్రమంలో అధికారులు బ్లాక్ బాక్స్‌ను దర్యాప్తుకు పంపించారు.