మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్, అతని నలుగురు స్నేహితులు కలిసి టెన్నిస్ క్రీడాకారిణి భువన భర్త అభినవ్ మహేందర్ ను చితకబాది ఆమెను కిడ్నాప్ చేసారని పోలీస్ కేసు నమోదయిన విషయం అందరికీ తెలిసిందే. ఇంతవరకు ఈ వ్యవహారంలో మంత్రి కుమారుడు ‘విలన్’ అనుకొంటే, అసలయిన విలన్ తన భర్త అభినవ్ మహేందర్ అని భువన స్వయంగా చెప్పడం విశేషం. ఈ వ్యవహారంలో ఇంతవరకు బయటపడని అనేక విషయాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆమె స్వయంగా బయటపెట్టారు.
భువన మీడియాకు ఏమి చెప్పారంటే, “అభినవ్ తో నాకు ఒక జిమ్ లో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది.ఇద్దరూ ఇష్టపడే వివాహం చేసుకొన్నాము. కానీ అభినవ్ తనకు అంత ముందే పెళ్లి జరిగిందన్న విషయాన్ని దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకొన్నాడు. మా పెళ్లి సంగతి మా తల్లి తండ్రులకి కూడా తెలియదు. పెళ్లి చేసుకొన్న తరువాత అతని ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. అతను నన్ను మూడు కోట్లు కట్నం తెమ్మని నిత్యం వేధించేవాడు. అతను ఆఫీసుకు వెళ్ళేటపుడు నన్ను ఇంట్లో ఉంచి బయట తాళం వేసుకొని వెళ్ళేవాడు. నన్ను నా తల్లి తండ్రులతో ఫోన్లో మాట్లాడనిచ్చేవాడు కాదు. పెళ్ళయినప్పటి నుంచి నేను చాలా మానసిక వేదన అనుభవించాను. ఈ విషయం తెలుసుకొన్న నా తండ్రి మహేంద్ర నాద్ మా కుటుంబ సభ్యులతో కలిసి నన్ను తీసుకువెళ్లడానికి అక్టోబర్ 26న తుకారాం గేట్ వద్ద మా ఇంటికి వచ్చినప్పుడు అభినవ్ ఆయనను కొట్టాడు. అనంతరం నా తండ్రి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో ఆయన కుమారుడు సాయి కిరణ్ నా తండ్రి చెప్పిన విషయాలన్నీ విని నన్ను అభినవ్ బారి నుండి కాపాడి తీసుకువచ్చేరు,” అని భువన చెప్పారు.
ఆ తరువాత తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ “నా కొడుకు ఏమీ డాన్ కాడు. కానీ కొన్ని రాజకీయ పార్టీలకు కొమ్ము కాసే మీడియా నాపైన, మా ప్రభుత్వం పైన బురద జల్లెందుకే నా కొడుకు సాయి కిరణ్ భువనను కిడ్నాప్ చేసాడని ప్రచారం మొదలుపెట్టాయి. భువన తండ్రి నా సహాయం కోరి వచ్చినప్పుడు నేను ఇంట్లో లేకపోవడంతో ఇంట్లో ఉన్న నా కుమారుడు సాయి కిరణ్ తక్షణమే స్పందించి భువనను కాపాడాడు అంతే తెప్ప ఆమెను కిడ్నాప్ చేసి ఎక్కడికో పట్టుకు పోలేదు. భువన స్వయంగా చెప్పిందంతా మీరే విన్నారు. కనుక ఇందులో నిజానిజాలేమిటో అందరికీ అర్ధమయ్యేయని భావిస్తున్నాను,” అని మంత్రి తలసాని అన్నారు.