మాజీ ఎంపి మరియు కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మాజీ సభ్యుడు అయిన హరిరామజోగయ్య ఇటీవల ఒక పుస్తకం వ్రాశారు. దానిలో చిరంజీవి, చంద్రబాబు నాయుడులపై ఆయన తీవ్ర ఆరోపణలు చేసారు. వంగవీటి రంగ హత్యకు చంద్రబాబు నాయుడే కారణమని ఆయన ఆరోపించారు. తెదేపా మనుగడ కోసమే ఆయన వంగవీటి రంగ హత్యకు అంగీకరించారని తన పుస్తకంలో పేర్కొన్నారు.
జోగయ్య తన పుస్తకంలో చిరంజీవిపై కూడా బాణాలు సందించారు. కాపు కులానికి చెందిన చిరంజీవి ముఖ్యమంత్రి అయితే కాపు కులస్తులకు మేలు జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే తను చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరాను. కానీ ఆయన ఎన్నికలలో పార్టీ టికెట్లు అమ్ముకొన్నారు. ఆయన పాలకొల్లులో ఓడిపోవడం కూడా స్వయంకృతాపరాధమే. చిరంజీవి దృష్టి ఎంతసేపు డబ్బు సంపాదనపైనే కానీ ప్రజాసేవ మీద లేదు. ఆయన తనకున్న ప్రజాకర్షనను పెట్టుబడిగా పెట్టి అధికారంలోకి రావాలని ప్రయత్నించి భంగపడ్డారు. ఆయన కంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ కి చాలా నిబద్దత ఉంది. కనుక ఆయన రాజకీయాలలోకి, చిరంజీవి సినిమాలలోకి వెళితే మంచిదని నా అభిప్రాయం,” అని వ్రాసారు.