హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భారతీయ జనతాపార్టీకి సవాల్ విసిరారు. ఇప్పటిదాకా తాను గొడ్డుమాంసం(బీఫ్) తినలేదని, అయితే తినాలనుకుంటే తింటానని, తననడగటానికి వారెవరని బీజేపీ నేతలపై మండిపడ్డారు. కన్నడ రాజ్యోత్సవాలకు హాజరైన సిద్దరామయ్య, మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ దాని అనుబంధ సంస్థలు చెబుతున్న బీఫ్ వ్యతిరేక విధానం అర్థంపర్థం లేదన్నారు.
గురువారంనాడు సిద్దరామయ్య బెంగళూరులో యూత్ కాంగ్రెస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, గొడ్డుమాంసంపై నిషేధాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని, తాను తినాలనుకుంటే దానిని తింటానని అని వ్యాఖ్యానించటంతో వివాదం ప్రారంభమయింది. దీనిపై కర్ణాటకలోని బీజేపీ నేతలు మండిపడ్డారు. సిద్దరామయ్య వ్యాఖ్యలు ఒక వర్గం ప్రజలను రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయంటూ ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ వజూభాయ్ వలాకు ఫిర్యాదు చేశారు. దీనిపై సిద్దరామయ్య నిన్న కన్నడ రాజ్యోత్సవాలలో మాట్లాడుతూ, మొన్న చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, గొడ్డుమాంసంగానీ, పందిమాంసం(పోర్క్)గానీ, ఏ ఇతర మాంసాన్నయినా తాను తినాలనుకుంటే తింటానని తననెవరూ ఆపలేరని అన్నారు. బీజేపీ నిరసనలను తాను పట్టించుకోనని చెప్పారు. బీజేపీ నేతలకు రాజ్యాంగం గురించి అవగాహన లేదని అన్నారు. ఆహార హక్కు గురించి తాను క్షుణ్ణంగా చదివానని, దానికి తాను కట్టుబడి ఉంటానని సీఎం చెప్పారు.