హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీలో కొన్నాళ్ళుగా కొనసాగుతున్న ఆధిపత్యపోరులో కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావుపై కొడుకు కేటీఆరే పైచేయి సాధించారు. వరంగల్ లోక్‌సభ ఉపఎన్నిక అభ్యర్థి విషయంలో హరీష్ తన అనుచరుడు ఎర్రోళ్ళ శ్రీనివాస్‌ను, కేటీఆర్ తన అనుచరుడు పసునూరి దయాకర్‌ను ప్రతిపాదించగా, చివరికి కేటీఆర్ మాటే నెగ్గింది. అభ్యర్థిత్వం దక్కించకున్న దయాకర్, దీనికిగానూ కేటీఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పటం ఈ వాదనను బలపరుస్తోంది. దీనితో హరీష్ అసంతృప్తితో రగిలిపోతున్నట్లు చెబుతున్నారు. హరీష్, కేటీఆర్ మధ్య పోరుపై వివిధ పత్రికల్లో కథనాలు జోరుగా వెలువడ్డాయి. ఇక ఆంధ్రజ్యోతి పత్రికైతే ఒక అడుగు ముందుకేసి, వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ రాజకీయాలు నివురుగప్పిన నిప్పులా మారాయని, పార్టీలో మంతి వ్యూహకర్తగా ముద్రపడిన హరీష్ రావుకు ప్రాధాన్యం తగ్గిందని ఆయన అనుచరవర్గం భావిస్తోందని రాసింది.
హరీష్ వరంగల్ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ అయినప్పటికీ, నిన్న వరంగల్‌లో నాయకత్వంలో జరిగిన పార్టీ సమావేశాలలో కడియం శ్రీహరి, ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, జగదీశ్వర్ రెడ్డి తదితరులందరూ పాల్గొన్నప్పటికీ హరీష్ మాత్రం హాజరుకాకపోవటాన్ని అతని అసంతృప్తికి నిదర్శనంగా చెబుతున్నారు. నిన్నంతా హరీష్ సిద్దిపేటలోనే ఉన్నారు. అయితే బయటకుమాత్రం దయాకర్ అభ్యర్థిత్వం సమష్ఠి నిర్ణయమేనని, తనతో సహా ఎవరికీ అసంతృప్తి లేదని హరీష్ చెప్పారు. అటు కేటీఆర్ కూడా, బయట ఊహాగానాలను పట్టించుకోవాల్సిన అవసరంలేదని అన్నారు. టీఆర్ఎస్ రికార్డ్ మార్జిన్‌తో విజయం సాధిస్తుందని అన్నారు. హరీష్‌కు, కేటీఆర్‌కు ఆధిపత్యపోరు ఈనాటిది కాదు… అయితే అది మొదట బయటపడింది ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పార్లీ ప్లీనరీ సమావేశాలలో. సమావేశాలలో కేటీఆరే హైలైట్ అవగా హరీష్ అసలు వేదికమీద కనిపించలేదు.
మరోవైపు ఈ ఎన్నిక ఫలితం తమ పాలనకు రిఫరెండం అంటూ కేటీఆర్ నిన్న హన్మకొండలో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కేటీఆర్‌ది ధీమానా, ఓవర్ కాన్ఫిడెన్సా అని చర్చ జరుగుతోంది. ఇటీవలకూడా తమ ప్రభుత్వం పనితీరు సరిగాలేకపోతే వచ్చే ఎన్నికల్లో తమను బండకేసి కొడతారని కేటీఆర్ అన్నారు. ఆయన కాన్ఫిడెన్స్ ఏమిటో వరంగల్ ఉపఎన్నిక ఫలితం తర్వాత తెలుస్తుంది.