హైదరాబాద్: బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ శౌరి ప్రధానమంత్రి నరేంద్ర మోడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దాద్రి ఘటనపై, బీఫ్ వివాదంపై, హర్యానాలో ఇద్దరు పిల్లల సజీవ దహనం వంటి హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడి చర్యలు తీసుకోకపోవటంపై మండిపడుతూ, బీహార్ ఎన్నికలలో గెలుపుకోసమే మోడి మౌనంగా ఉన్నారని ఆరోపించారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వానికి నకలుగానే ఉందని, కాంగ్రెస్‌కు ఒక ఆవు కలిపినట్లయిందని ఎద్దేవా చేశారు. మోడి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బీహార్‌లో ఒక మతాన్ని మరొక మతంపైకి పురిగొల్పుతున్నారన్న వాదనతో తానూ ఏకీభవిస్తానని అన్నారు. 2002 సంవత్సరంనుంచి మోడి అసహనానికి బాధితుడంటూ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. దేశంలో పెరిగిపోతున్న అసహనానికి నిరసనగా రచయితలు, కళాకారులు బయటకు రావటాన్ని శౌరి సమర్థించారు. వారి నిరసనలను బీజేపీ విమర్శించటాన్ని ఖండించారు.
నరేంద్ర మోడి ప్రభుత్వంలో పనిచేసే ఏ సెక్షన్ ఆఫీసరో, డిపార్ట్మెంట్ హెడ్డో కాదని, దేశప్రధాని అన్న విషయం తాను గుర్తుంచుకోవాలని అన్నారు. దేశానికి నైతిక మార్గాన్ని నిర్దేశించాలని, సత్ప్రవర్తనద్వారా దేశంలో ప్రమాణాలు నెలకొల్పాలని శౌరి సూచించారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలకు ఎడిటర్‌గా పనిచేసిన శౌరి, 2002-2004 మధ్య కేంద్ర టెలికమ్యూనికేషన్స్, ఐటీ శాఖల మంత్రిగా పనిచేశారు. కొంతకాలంనుంచి బీజేపీలో క్రియాశీలకంగా లేరు.