హైదరాబాద్: పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబాయి పేలుళ్ళ కుట్రదారు – దావూద్ ఇబ్రహీంకు సెక్యూరిటీని పటిష్ఠం చేశారు. దావూద్ చిరకాల శత్రువు ఛోటా రాజన్ ఇండోనేషియాలో అరెస్ట్ అయిన నేపథ్యంలో దావూద్‌కు, లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ అధినేత, 26/11 ముంబాయి పేలుళ్ళు కుట్రదారు హఫీజ్ మొహమ్మద్ సయీద్‌కు పాకిస్తాన్ ఆర్మీ భద్రత పెంచిందని భారత ఇంటలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఛోటా రాజన్ అరెస్ట్ అవటంతో ఇక దావూద్‌పై భారత్ దృష్టి పెడుతుందనే ఉద్దేశ్యంతోనే సెక్యూరిటీని టైట్ చేసినట్లు చెబుతున్నారు. కరాచీ, ఇస్లామాబాద్ నగరాలలో ఉన్న దావూద్ ఇళ్ళవద్ద పాక్ స్పెషల్ కమాండోలను మోహరించినట్లు ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం. అతని ఇళ్ళ అడ్రెస్‌లు, ఆ ఇళ్ళ తాజా ఫోటోలు, అతని భార్య పేరుమీద ఉన్న బిల్లులతో ఇంటెలిజెన్స్ వర్గాలు పక్కాగా ఆధారాలు సేకరించి ఇటీవలే నివేదిక రూపొందించాయి. అతను తమవద్ద లేడంటూ పాకిస్తాన్ చెబుతూ వస్తున్నందున, ఆగస్ట్‌లో జరగాల్సిన ఇరుదేశాల ఉన్నతస్థాయి చర్చలలో ఈ నివేదికను పాకిస్తాన్ ముందు పెట్టాలని అధికారులు భావించారు. అయితే ఆ చర్చలు రద్దయ్యాయి. ఆ నివేదికలో సమాచారం ప్రకారం – దావూద్ కొన్నేళ్ళుగా పాకిస్తాన్ నుంచి కాలు బయటపెట్టటంలేదు. తరచూ ఇళ్ళు మారుతూ ఉంటాడు. భారత్‌లో ఐఎస్ఐ సంస్థ జరిపే తీవ్రవాద కార్యకలాపాలకు సాయపడటంతోపాటు, అక్రమ వసూళ్ళు, బెట్టింగ్, డ్రగ్స్, ఆయుధాల రవాణా తదితర వ్యాపారాలు చేస్తున్నాడు. దావూద్‌ను పట్టుకొచ్చి తీరుతామంటూ కొన్ని రోజులక్రితం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్‌లో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు బాలిలో ఛోటా రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాలి జైలులో తన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పాడు. దావూద్ పాకిస్తాన్‌లో ఐఎస్ఐ సంరక్షణలో ఉన్నాడని అన్నాడు. తనకు ముంబాయి పోలీసులపై నమ్మకంలేదని, వారిలో దావూద్ మనుషులు ఉన్నారని చెప్పాడు. తనను ముంబై బదులు ఢిల్లీ తీసుకెళ్ళాలని కోరాడు. ముంబై పోలీసులు తనను చిత్రహింసలు పెట్టారని అన్నాడు. దావూద్ అంటే తనకు భయంలేదని చెప్పాడు.