తెలంగాణా బీజేపీలో వరంగల్ ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు బలమయిన అభ్యర్ధి లేకపోయినప్పటికీ పట్టుబట్టి తెదేపా నుండి ఆ సీటును తీసుకొన్నారు. ఇల్లలకగానే పండగ కాదన్నట్లుగా సీటు తీసుకోగానే గెలిచినట్లు కాదని బీజేపీ నేతలు ఈపాటికే గ్రహించి ఉండాలి. సీటు తీసుకొన్నప్పటి నుంచి ఉప ఎన్నికలలో పోటీ చేయగల తగిన అభ్యర్ధి కోసం బీజేపీ నేతలు భూతద్దం పట్టుకొని వెతికి చివరికి డా.పగటిపాటి దేవయ్య పేరును ఖరారు చేసారు.
డా.పగటిపాటి దేవయ్య వరంగల్ జిల్లాకు చెందినవారే కానీ ఆయన అమెరికాలో వైద్యుడిగా స్థిరపడినందున స్థానిక ప్రజలకు పెద్దగా పరిచయం లేదు. ఆయన అమెరికాలో, తెలంగాణాలో సాఫ్ట్ వేర్ సంస్థలు నడిపిస్తున్నట్లు సమాచారం. ఆయన వయసు 69సం.లు. ఇంతకు ముందు ఎన్నడూ ఏ రాజకీయ పార్టీలోను పనిచేసిన అనుభవం లేదు. ఈ ఎన్నికలలో బీజేపీ అభ్యర్ధిగా పేరు ఖరారు అయింది కనుక బీజేపీ కండువా కప్పుకొంటున్నారు. రాజకీయ అనుభవం లేదు కనుక ఎన్నికలలో ఎలాగా నెగ్గుకు రావాలో ఆయనకు తెలియదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అమెరికాలో చాలా కాలం పనిచేసి, సాఫ్ట్ వేర్ సంస్థలను నడిపిస్తున్నారు కనుక ఆర్ధికంగా శక్తిమంతులే అయ్యుండవచ్చును. బహుశః రాష్ట్ర బీజేపీ నేతలు ఆ ఒక్క అంశమే పరిగణనలోకి తీసుకొని ఆయన అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసినట్లున్నారు. ఆ ఒక్కటీ తప్ప మిగిలినవన్నీ ఆయన ఈ ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హతలేనని చెప్పక తప్పదు.
అధికార తెరాస, వామ పక్షాల అభ్యర్ధులతో పోలిస్తే ఆయన వయసులో చాలా పెద్దవారు. కనుక అది కూడా ఒక లోపమేనని చెప్పక తప్పదు. ఈ ఎన్నికలలో తెరాస, కాంగ్రెస్, వామపక్షాల అభ్యర్ధులతో పోల్చి చూస్తే డా. దేవయ్యకు బొత్తిగా రాజకీయ అనుభవం లేదు. అన్నిటి కంటే అదే పెద్ద లోపం. కనుక ఈ ఎన్నికలలో పోటీ ప్రధానంగా తెరాస-కాంగ్రెస్-వామపక్షాలు బలపరుస్తున్న స్వతంత్ర అభ్యర్ధి గాలి వినోద్ కుమార్ మధ్యనే ఉండవచ్చును. దయాకర్, వినోద్ కుమార్ ఇరువురు యువకులు, స్థానికులతో మంచి పరిచయాలున్నవారు కనుక పోటీ ప్రధానంగా వారిద్దరి మధ్యే సాగవచ్చును. అయితే అపార రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ అభ్యర్ధి రాజయ్య నుండి కూడా వారిరువురూ గట్టి పోటీ ఎదుర్కోవలసి ఉంటుంది. వైకాపా నల్లా సూర్యప్రకాష్‌ను తన అభ్యర్ధిగా నిలబెట్టింది. అయితే ఆయన ప్రతిపక్షాల ఓట్లు చీల్చి తెరాసకు పరోక్షంగా సహాయపడేందుకే బరిలో దిగుతున్నారని భావించవచ్చును.