హైదరాబాద్: బీఫ్ వివాదంపై బాలీవుడ్ భాద్షా షారుక్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దేశభక్తుడిగా ఉండటంకన్నా లౌకికవాదిగా ఉండకపోవటం అతి నీచమైన నేరం అని షారుక్ అన్నారు. నిన్న తన జన్మదినం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, దేశంలో చర్చనీయాంశంగా మారిన మత అసహనంపై స్పందించారు. దేశంలో మత అసహనం తీవ్రస్థాయికి చేరిందని అన్నారు. అయితే, తానుకూడా తన అవార్డ్‌లను వెనక్కు ఇచ్చేటంత పరిస్థితి ఇంకా రాలేదని భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. దేశంలో పెరిగిపోతున్న మత అసహనం చీకటియుగానికి తీసుకెళుతుందని అన్నారు. అసహనాన్ని నిరసిస్తూ అవార్డ్‌లు వెనక్కి ఇచ్చేవారిని గౌరవిస్తున్నానని చెప్పారు. భావప్రకటన స్వేఛ్ఛగురించి తానూ మాట్లాడొచ్చని, అయితే జనం తన ఇంటిముందుకొచ్చి రాళ్ళేస్తారని అన్నారు. మాంసం తినే అలవాట్లనుబట్టి మతాన్ని నిర్వచించరాదని చెప్పారు. తన వైఖరిని వెల్లడిస్తే సినిమా ఇబ్బందుల్లో పడుతుందనే ఉద్దేశ్యంతో బయటపెట్టనని అన్నారు.
మరోవైపు విశ్వహిందూ పరిషత్ నాయకురాలు, బీజేపీ మహిళా నేత సాధ్వి ప్రాచీ – షారుక్ ఖాన్‌ను పాకిస్తాన్ ఏజెంట్‌గా అభివర్ణించారు. లక్నోలో మీడియాతో మాట్లాడుతూ, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న షారుక్‌ను శిక్షించాలని డిమాండ్ చేశారు. అతను పాక్‌కు వెళ్ళొచ్చని సూచించారు. షారుక్‌తోపాటు జాతీయ అవార్డ్‌లను వెనక్కి ఇస్తున్నవారందరినీ కఠినంగా శిక్షించాలని అన్నారు.
ఇదిలా ఉంటే, నటుడు కమల్ హాసన్ కూడా మత అసహనంపై స్పందించారు. ఆయన ఇవాళ తన తాజా చిత్రం చీకటిరాజ్యం ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. దేశంలో అసహనం పెరగటం మంచిది కాదని అన్నారు. మత విద్వేషాల కారణంగా దేశం ఒకసారి చీలిందని, మరోసారి విచ్ఛిన్నం కారాదని చెప్పారు. చీలకుండా ఉండిఉంటే దేశం – ప్రపంచంలోనే అతిపెద్దదిగా ఉండేదని అన్నారు. అవార్డులు వెనక్కి ఇవ్వటంవలన ఎలాంటి ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. మత అసహనంపై చర్చ జరగాలని, దానిని తెలివిగా ఎదుర్కోవాలని చెప్పారు. మత అసహనం ఇప్పుడు కొత్తగా ఏమీ రాలేదని, గతంనుంచీ ఉందని అన్నారు. తనకొచ్చిన అవార్డ్‌లను వెనక్కి ఇవ్వబోనని చెప్పారు. తనకు అన్ని మతాలూ సమానమేనని అన్నారు.