ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని బీజేపీ జాతీయ నాయకులు కలలు కంటున్నారు. అయితే అందుకోసం రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తున్న కృషి శూన్యం. సోము వీర్రాజు, పురందేశ్వరి, కావూరి సాంబశివరావు వంటివారు ఎంతసేపు తెదేపాను విమర్శించడంపై చూపుతున్న శ్రద్ద పార్టీని బలోపేతం చేసుకోవడంపై చూపడం లేదు. రాష్ట్రాభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి, రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయసహకారాలు చాలా అవసరం కనుకనే తెదేపా నేతలు బీజేపీ నేతల విమర్శలను మౌనంగా సహిస్తున్నారు. ఆ విషయం బీజేపీ నేతలకి కూడా తెలుసు అందుకే వారు మరింత రెచ్చిపోతున్నారు. కానీ వారు తెదేపాను విమర్శించే ప్రయత్నంలో తమ స్వంత పార్టీకే ప్రజలలో వ్యతిరేకత పెరిగేలా చేసుకొంటున్నారని గ్రహించడం లేదు.
రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా, ప్యాకేజి, రైల్వే జోన్ వంటి హామీల విషయంలో కేంద్రప్రభుత్వాన్ని నిలదీయకుండా తెదేపా ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, తెదేపాకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ నేతలు దానికి అండగా నిలబడి సంజాయిషీ చెప్పకపోగా వారు కూడా ప్రతిపక్ష పార్టీలలాగే తెదేపాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలకు తాము సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదన్నట్లుగా, అసలు ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంశాలతో తమకు సంబంధమే లేదన్నట్లుగా రాష్ట్ర బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఆ కారణంగా బీజేపీపై ప్రజలలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెదేపా దుస్థితి చూసి జాలి పడుతున్నారు. అందుకే ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ ,వైకాపాలు ఎంత హడావుడి చేస్తున్నా ప్రజలు పెద్దగా స్పందించడం లేదని చెప్పవచ్చును.
కనుక బీజేపీ నేతలు గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, తెదేపా వినయంగా తలవంచుకొని ఉన్నప్పటికీ అది దాని బలహీనత కాదు అవసరమని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రప్రభుత్వంతో వినయంగా ఉంటూ రాష్ట్రాభివృద్దికి అవసరమయిన సహాయ సహకారాలు పొందాలని ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రాభివృద్ధి జరిగి రాష్ట్రం మళ్ళీ తన కాళ్ళ మీద తను నిలబడగలిగితే, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఏర్పాటు, విజయవాడకు మెట్రో రైల్ ఏర్పాటు తదితర హామీలపై మాట తప్పినప్పటికీ ప్రజలు బీజేపీని ఉపేక్షించవచ్చును. లేకుంటే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే దానికీ పట్టవచ్చును. అటువంటి పరిస్థితులు ఉన్నట్లు తెదేపా భావిస్తే అప్పుడు బీజేపీతో తెగ తెంపులు చేసుకోవడం తధ్యం. అదే జరిగితే తెదేపా అండలేని బీజేపీ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా దక్కదు. కనుక వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రాభివృద్ధి, రాజధాని నిర్మాణం, వివిధ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడం తెదేపా కంటే బీజేపీకే చాలా ముఖ్యం. కనుక రాష్ట్ర బీజేపీ నేతలు తెదేపా ప్రభుత్వంతో యుద్ధం చేయడం మానుకొని వారు కూడా యధాశక్తిన రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తే వారికే మంచిది.తెదేపాను విమర్శిస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలందరూ తమందరి కంటే చాలా సీనియర్ నేత, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెదేపాతో ఏవిధంగా వ్యహరిస్తున్నారో, అలాగా ఎందుకు వ్యవహరిస్తున్నారో తెలుసుకొంటే ఇంకా మంచిది.