`అసహనం..దేశానికి చేటు’ అంటూ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ వ్యాఖ్యానించడాన్ని సీనియర్ బిజెపీ నాయకుడు కైలాష్ విజయ్ వార్గియా మండిపడుతున్నారు. షారుఖ్ ఖాన్ శారీరకంగా ఉండేది భారతదేశంలోనైనా, ఆయనగారి హృదయం (ఆత్మ) మాత్రం పాకిస్తాన్ లో ఉన్నదనీ కేంద్ర మాజీ మంత్రి కైలాష్ ట్విటర్ లో పోస్ట్ చేశారు.
`ఇది దేశ వ్యతిరేక కుట్రకాదా?’ అని ఆయన ప్రశ్నిస్తూ, ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో సభ్యత్వం రాకుండా పాకిస్తాన్ సహా అనేక శక్తులు అడ్డుపడ్డాయి. కుట్రలుచేశాయి. అలాగే ఇప్పుడు దేశంలో అసహన వాతావరణం ఏర్పడటానికి ఒక కుట్ర జరుగుతోంది. షారుఖ్ ఖాన్ హృదయం పాక్ ప్రేరిత కుట్రరాగాలనే ఆలపిస్తోంది. ఇలాంటి శక్తులు దేశవ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఈ బిజెపీ నాయకుడు మండిపడ్డారు.
1993లో బొంబాయిలో వందలాదిమంది మరణించినప్పుడు షారుఖ్ ఎక్కడున్నాడు? అలాగే, ముంబయి ముట్టడి జరిగినప్పుడు ఇదే షారుఖ్ ఎక్కడున్నాడని కైలాష్ సూటిగా ప్రశ్నించారు.
కుట్రపూరితంగా కొంతమంది వ్యక్తులు, దేశంలో అసహనం పెరిగిపోతున్నదనీ, సహనశీలత కరవైపోయిందని ఆందోళన చెందుతున్నారు. కానీ నిజానికి పరిస్థితి వేరుగా ఉంది. ప్రపంచదేశాల్లో భారత్ తన విలువను ఇటీవలకాలంలో పెంచుకుంది. భారత్ నాయకత్వ పటిమను ప్రపంచదేశాలు నేడు గుర్తించాయని బిజెపీ నేత చెబ్దూ తెగ సంబరపడిపోయారు.
దేశమంతటా ఇప్పుడు అసహనంపై చర్చజరుగుతోంది. సహనశీలత దేశంలో కనిపించడంలేదని మేధావి వర్గం భావిస్తోంది. రచయుతలు, చరిత్రకారులు, ఫిల్మ్ మేకర్స్ , శాస్త్రవేత్తలు తమ ప్రభుత్వ పురస్కారాలను తిరిగి ఇచ్చేయాలనుకోవడం, వేరువేరుచోట్ల మతపరమైన దాడులు జరగడం వంటి సంఘటనలతో కాంగ్రెస్, వామపక్షాలు కేంద్రప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఈ నేపథ్యంలో షారుఖ్ ఖాన్ తన 50వ జన్మదినోత్సవ వేడుకను పురస్కరించుకుని మీడియాతో మాట్లాడుతూ, `అసహనం..దేశానికి చేటు’ అంటూ వ్యాఖ్యానించారు. చలన చిత్రరంగానికి చెందిన దివాకర్ బెనర్జీ, ఆనంద్ పట్వర్థన్ లు తమ పురస్కారాలను వాపసు చేయాలని ధైర్యంగా తీసుకున్న నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నట్లు కూడా షారుఖ్ చెప్పారు. ఇది సరైన చర్యగా అభివర్ణించారు. తన మద్దతు వారికి ఉంటుందని అంటూ, అలా వాపసు చేయడానికి తనవద్ద జాతీయ చలనచిత్ర పురస్కారమేదీ లేదని చెప్పారు. మతపరమైన , సృజనపరమైన అసహనం దేశంలో ఉండకూడదని సందేశం కూడా ఇచ్చారు.
షారుఖ్ చేసిన వ్యాఖ్యలకు కైలాష్ మండిపడ్డారిప్పుడు. అయితే, కేంద్ర మంత్రి ప్రకాష్ జావేద్కర్ మాత్రం కైలాస్ మాటలను పట్టించుకోనక్కర్లేదనీ, ఆయనేమీ పార్టీ మీడియా ప్రతనిధి కాదని తేల్చిపారేశారు. కైలాష్ ఇలాంటి వ్యాఖ్యలు ట్వీట్ చేయడాన్ని తాను ఖండిస్తున్నానని వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.
`దేశంలో అసహనం’ వంటి సెన్సిటీవ్ సబ్జెక్ట్ ని షారుఖ్ ప్రస్తావించకుండా ఉండాల్సిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పుట్టినరోజు వేడుకలో అనవసరంగా ఈ ఇష్యూ తీసుకువచ్చారనీ ఆయన అభిమానులు అనుకుంటున్నారు.