వరంగల్ కాంగ్రెస్ అభ్యర్ధి సిరిసిల్ల రాజయ్య ఇంట్లో నిన్న రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. అందులో ఆయన కోడలు సాగరికతో సహా ముగ్గురు మనుమలు అభినవ్ (7), అమోన్ (3),శ్రీయోన్ (3) సజీవ దహనం అయ్యారు. అగ్ని ప్రమాదం సంగతి తెలుసుకొన్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికే చేరుకొని మంటలు ఆర్పివేశారు. కానీ అప్పటికీ నాలుగు నిండు ప్రాణాలు అగ్నికి ఆహుతి అయిపోయాయి. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియవలసి ఉంది.
కుటుంబ కలహాల కారణంగానే సాగరిక ఈపనికి పూనుకొని ఉండవచ్చని ఇరుగు పొరుగు వారు అనుమానిస్తున్నారు. సాగరిక భర్తకు మరొక భార్య కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అతను ఆమెతోనే హైదరాబాద్ లో ఉంటున్నట్లు సమాచారం. సాగరిక వరంగల్ లో రాజయ్య ఇంట్లోనే మేడ మీద అంతస్తులో తన పిల్లలతో కలిసి ఉంటున్నారు. అప్పుడప్పుడు ఆమె భర్త వచ్చి చూసి పోతూ ఉండేవారని తెలుస్తోంది. అప్పుడప్పుడు అత్త కోడళ్ళ మధ్య గొడవలు జరుగుతుండేవని ఇరుగు పొరుగు వారు చెపుతున్నారు. సుమారు ఏడాది క్రితం సాగరిక తన భర్తపై పోలీసులకు పిర్యాదు చేసినట్లు సమాచారం. ఆమె న్యాయం కోరుతూ తన మామగారు రాజయ్య ఇంటి ముందు మౌనదీక్ష కూడా చేసినట్లు తెలుస్తోంది. తన కాపురం ఈవిధంగా తయారయినందుకు ఆమె తీవ్ర ఆవేదన చెంది ఈపనికి పూనుకొని ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక సాగరిక ఆత్మహత్యా ప్రయత్నం చేసుకొందా? లేక వేరే ఎవరయినా ఈ పని చేసారా?అనేది పోలీసుల దర్యాప్తులో తేలవలసి ఉంది. వరంగల్ పోలీస్ కమీషనర్ సుదీర్ బాబు ఘటనాస్థలం వద్దకు వచ్చి పరిశీలించిన తరువాత పోలీసులను దర్యాప్తుకు ఆదేశించారు.