శాస్త్రీయంగా జరిపిన సర్వేల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. దీంతో బీహార్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది. గురువారం నాడు చివరి, ఐదో విడత పోలింగ్ జరుగుతుంది. ఆదివారం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇప్పటికీ బీహార్ ఫలితంపై భిన్నమైన అంచనాలే వినిపిస్తున్నాయి. అయితే, అక్రమ బెట్టింగ్ జరిపే ముఠాలు మాత్రం బీజేపీదే గెలుపంటున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసి బుకీలు బెట్టింగ్ నిర్వహిస్తారు.
తాజాగా వారి అంచనాల ప్రకారం, మొత్తం 243 సీట్లలో ఎన్డీయే 150 నుంచి 152 సీట్లు గెలుస్తుంది. సొంతంగా బీజేపీకి 110 నుంచి 112 సీట్లు వస్తాయి. నితీష్ కుమార్ పార్టీ జేడీయూ 44 నుంచి 46, లాలు పార్టీ ఆర్జేడీ 27 నుంచి 29 సీట్లు గెలవవచ్చని అంచనా. కాంగ్రెస్ కు 8 నుంచి 10 సీట్లు దక్కవచ్చనేది బుకీల లెక్క.
ఈ లెక్కల ఆధారంగానే బుకీలు జోరుగా బెట్టింగ్ జరుపుతున్నారు. మరోవైపు, పరిశీలకులు కూడా అంచనాల్లో తలమునకలై ఉన్నారు. వారి అంచనాల ప్రకారం, మొదటి రెండు విడతల్లో ఎన్డీయేకు స్వల్ప మొగ్గు ఉంటుంది. మూడో విడతలో లాలు నితీష్ మహాకూటమి మంచి ఫలితాలు సాధిస్తుంది. నాలుతో విడతలో ఎన్డీయేది పైచేయి అవుతుంది. ఐదో విడత కీలకంగా మారుతుంది. ఎక్కువ మంది పరిశీలకులు ఈ అంచనాలే వినిపిస్తున్నారు. అందుకే, ఐదో విడతపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. అక్కడ 57 సీట్లకు పోలింగ్ జరగబోతోంది.
సీమాంచల్ ప్రాంతంలో జరిగే ఈ విడతపై మహా కూటమి గంపెడాశతో ఉంది. ముస్లింలు, యాదవులు కలిసి దాదాపు 38 శాతం ఉన్న ఈ ప్రాంతంలో ఎక్కువ సీట్లు సాధిస్తామని లాలు, నితీష్ ఆశిస్తున్నారు. అయితే, ఈ ఓటు బ్యాంకుకు ఎంతో గండికొట్టే ఐంఎంఎం, పప్పు యాదవ్, ఇతర అంశాలు తమకు కలిసి వస్తాయని బీజేపీ భావిస్తోంది. పైగా, మైనారిటీలను దువ్వడానికి మహా కూటమి చేసే ప్రయత్నాల వల్ల ఇతర వర్గాల ఓటర్లు తమ వైపు మొగ్గు చూపుతారని, సమకీరణాలు మారుతాయనేది కమలనాథుల లెక్క.
బీహార్లో ఎన్డీయే గెలిస్తే సంస్కరణలు వేగవంతం అవుతాయనే అంచనాలున్నాయి. బీజేపీ ఓడిపోతే సంస్కరణల జోరు తగ్గడంతో పాటు ఇంకా అనేక విధాలుగా నెగెటివ్ ప్రభావం పడుతుందని, స్లాక్ మార్కెట్లు కుప్ప కూలుతాయని భావిస్తున్నారు. ఇతర దేశాలు కూడా బీహార్ ఎన్నికలపై ఆసక్తి చూపడానికి అనేక కారణాలున్నాయి. మేకిన్ ఇండియాలో భాగంగా పెట్టుబడులు పెట్టాలంటే సంస్కరణల వేగం పెరుగుతుందనే భరోసా ఉండాలి. కాబట్టి బీహార్లో బీజేపీ గెలవాలని ఆయా దేశాల పారిశ్రామికవేత్తలు కోరుకుంటున్నారు. మరి బీహార్ ప్రజలు ఏం కోరుకుంటున్నారనేది ఆదివారం తేలిపోతుంది.