హైదరాబాద్: వరంగల్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య కోడలు, ముగ్గురు మనవళ్ళు కాలి చనిపోవటం ప్రమాదమా, హత్యా అనేదానిపై వివాదం ఏర్పడింది. ఈ ఘటనలో అనేక కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. బెడ్రూమ్లో గ్యాస్ సిలిండర్ లీక్ చేసుకుని సారిక, ఆమె పిల్లలు ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నిన్నరాత్రి రాజయ్యకు, ఆయన కోడలు సారికకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిందని చెబుతున్నారు. సారికకు, రాజయ్య కొడుకు అనిల్‌కు కొంతకాలంగా పొరపొచ్చాలు ఉన్నాయని సమాచారం. అనిల్‌కు వేరే మహిళతో సంబంధం ఉందని, ఇటీవల ఆమెను పెళ్ళికూడా చేసుకున్నాడని అంటున్నారు. మరోవైపు సారిక రాజయ్యకు టికెట్ ఇవ్వటానికి వ్యతిరేకంగా ఏఐసీసీకి నాలుగు రోజులక్రితం లేఖరాసినట్లు సమాచారం. ముగ్గురు పిల్లలతో సహా తనను రోడ్డున పడేశారని ఆ లేఖలో ఆరోపించారట. రాజయ్యపై, ఆయన కుటుంబ సభ్యులపై సారిక గతంలో హైదరాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్లో పోలీస్ కేసు పెట్టిందని తెలిసింది. కోడలు సారిక ఆత్మహత్య చేసుకునేటంత పిరికిది కాదని స్థానికులు, ఆమె పుట్టింటివారు చెబుతున్నారు. స్థానికలు రాజయ్యదే తప్పన్నట్లు టీవీ ఛానల్స్‌లో బైట్లు ఇస్తున్నారు. తమ సోదరి ఆత్మహత్య చేసుకునేటంత పిరికిది కాదని సారిక చెల్లెలు అక్షర చెప్పారు. రాజయ్య కుటుంబ సభ్యులు ఆమెను ఎంతోకాలంగా చిత్రహింసలు పెడుతున్నారని, అయినాగానీ పిల్లలకోసం భరిస్తూ వస్తోందని అన్నారు. సారిక, ఆమె పిల్లలకు ఇల్లు వదిలేసి రాజయ్య, ఆయన భార్య విడిగా ఉంటున్నారని తెలిపారు. మరోవైపు బెడ్ రూమ్‌లో గ్యాస్ సిలిండర్ ఉండటం అనుమానాలను రేకెత్తించేదిగా ఉంది. క్లూస్ టీమ్ పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. అనిల్నుకూడా ప్రశ్నిస్తున్నారు. సారికది నిజామాబాద్ జిల్లా అడ్లూర్ అని తెలిసింది. రాజయ్య కిందపడి శోకాలు పెట్టటం, వచ్చినవాళ్ళ కాళ్ళుపట్టుకుని ఏడవటం ఓవరాక్షన్లాగా కనిపిస్తోంది.