హైదరాబాద్: వరంగల్ ఉపఎన్నిక అభ్యర్థి రాజయ్య ఇంట్లో విషాదం నెలకొనటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చింది. మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణను అభ్యర్థిగా ఖరారు చేశారు. హైకమాండ్ సర్వే పేరును ఖరారు చేయటంతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బీ ఫారం తీసుకుని వరంగల్ బయలుదేరారు. సర్వేకూడా కాసేపట్లో వరంగల్ బయలుదేరనున్నారు. ఇవాళ ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు.
సర్వే 2004లో సిద్దిపేటకు, 2009లో మల్కాజ్‌గిరికి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్రంలో కొద్దికాలం మంత్రిగాకూడా పనిచేశారు. వరంగల్ నియోజకవర్గానికి కడియం రాజీనామా చేయగానే సర్వే అక్కడ పోటీకి ఉత్సాహం చూపారు. పోటీకి సిద్ధమంటూ ప్రకటనకూడా చేశారు. అయితే మిగిలిన కాంగ్రెస్ అగ్రనాయకులందరూ ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. దీనికి కారణం లేకపోలేదు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న రోజులలో సర్వే ఏనాడూ ఉద్యమంలో పాల్గొనలేదు. కారణం ఆయన ప్రాతినిధ్యం వహించే మల్కాజ్గిరి నియోజకవర్గంలో సీమాంధ్రులు ఎక్కువగా ఉంటారు. వారి మనసు నొప్పించటం ఇష్టంలేక సర్వే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. అందువలనే సర్వే అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించారు. అయితే అనూహ్యంగా రాజయ్య తప్పుకోవటంతో సర్వేకు టికెట్ దక్కింది. సర్వే కుమార్తె సుహాసిని ఇటీవల కంటోన్మెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు.