పాలకుల అసమర్థతను నిగ్గదీసి అడిగే స్థాయిలో సంఘటన ఎక్కడ జరిగినా దాని చుట్టూ రాజకీయ వలయాలు ముసురుకోవడం మనదేశంలో సహజమైపోయింది. అధికారపార్టీ, ప్రతిపక్షం ఒకదానిపై మరొకటి దుమ్మెత్తిపోసుకోవడమన్నది నేటి నికృష్ట రాజకీయాలకు పరకాష్టగా నిలుస్తోంది. రాజస్థాన్ లో మద్యపానాన్ని నిషేధించాలంటూ ఒక గాంధేయవాది చేసిన నిరాహారదీక్ష చివరకు ఆ పెద్దాయన ప్రాణాలనే బలిగొంది. అయితే, రాజకీయనాయకులు మాత్రం నిస్సిగ్గుగా ఒకరిపైమరొకరు బురదలజల్లుకుంటున్నారు. విషాద సంఘటనను సైతం రాజకీయ బురదగుంటలోకి ఈడ్చి కుమ్ములాటకు దిగుతున్నారు.
మద్యం మహమ్మారిని తరిమికొట్టాలని ఏకదీక్షతో నిరవధిక నిరాహారదీక్ష చేసిన రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే గురుచరణ్ ఛాబ్రా ఆస్పత్రిలో మరణించడం అందర్నీ కలచివేసింది. తాగుడుకి బానిసలై ప్రాణాలు తీసుకుంటున్నవారు చాలామందే ఉన్నారు. కానీ మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని కోరుతూ సదాశయంతో నిరశన దీక్షకు కూర్చున్న వ్యక్తి అశువులుబాయడం మరింతగాహృదయవిదారక దృశ్యమై నిలిచింది.
65ఏళ్ల ఈ మాజీ ప్రజాప్రతినిధి క్రిందటి నెలలో గాంధీజయంతిరోజున మద్యపానాన్ని నిషేధించాలంటూ నిరశన దీక్ష ప్రారంభించారు. రెండువారాల క్రిందటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్సపొందుతున్న ఆస్పత్రిలో నవంబర్ 3 (మంగళవారం) కన్నుమూశారు. చివరి రెండు రోజులు కోమాలో ఉన్నారు. నెలరోజులుగా ఆయన మద్యపాన నిషేధం కోసం పోరాడుతున్నా ఫలితం మాత్రం శూన్యం.
గాంధేయవాది మరణం రాజకీయ పార్టీలను ఏమాత్రం కదలించలేదు. పైగా ఈ సంఘటనను సైతం కూడా రాజకీయ కుంపటిగా మార్చుకున్నారు. దీంతో చిటపటలు ఎక్కువయ్యాయి. బిజేపీ, కాంగ్రెస్ పార్టీలు యధావిధిగా రంగంలోకి ప్రవేశించి, గురుచరణ్ మరణానికి కారణం `నువ్వంటే నువ్వేనంటూ’ కీచులాడుకుంటున్నారు. రాజస్థాన్ లో ప్రస్తుతం బిజేపీ పాలన కొనసాగుతోంది. ముఖ్యమంత్రి వసుంధరా రాజే సకాలంలో జోక్యం చేసుకుని నిరశన దీక్షను విరమింపజేసిఉంటే ఈ ఉపద్రవంవచ్చేది కాదని కాంగ్రెస్ నాయకులు తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నిన్న ఆస్పత్రికి వెళ్ళినప్పుడు గురుచరణ్ పరిస్థితి సీరియస్ గానే ఉంది. అప్పటికే రెండు పార్టీలు విమర్శనాస్త్రాలను సిద్ధంచేసుకునే పనిలోపడ్డారు.
గురుచరణ్ గతంలో జనతాపార్టీ ఎమ్మెల్యేగా సేవలందించారు. ఆయన నిరశన దీక్షకు కూర్చోవడం ఇది నాలుగవసారి. అయినప్పటికీ రాష్ట్రప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదన్నది కాంగ్రెస్ నేతల వాదన. గాంధీయవాది మరణంతోనైనా ప్రభుత్వం కళ్లుతెరవాలి. ఆయన మరణానికి బిజెపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తోంది. గురుచరణ్ డిమాండ్ కి స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినా కఠిన చర్యలు తీసుకోలేదు. గత్యంతరం లేక గురుచరణ్ నిరశన దీక్షకు కూర్చున్నారు. చివరకు తన కోరికలను తీర్చుకోకుండానే ఆయన అశువులుబాశారు.
అయితే, కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను బిజెపీ నేతలు తిప్పికొడుతున్నారు. గురుచరణ్ డిమాండ్లలో 90శాతం తీర్చామనిచేతులుదులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న గెహ్లాట్ ఏ చర్యలూ తీసుకోలేదని విమర్శిస్తున్నారు. గురుచరణ్ నాలుగుసార్లు చేసిన నిరశన దీక్షల్లో రెండు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే జరగడం గమనార్హం. అప్పట్లోనే గురుచరణ్ డిమాండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిఉంటే ఇప్పుడు ఆయన మరణం చోటుచేసుకుని ఉండేదికాదన్నది బిజెపీ వాదన.
ఈవాద ప్రతివాదనలు ఎలాఉన్నప్పటికీ మనకు మాత్రం ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మద్యపానాన్ని నిషేధించే చిత్తశుద్ధి లేనేలేదని ఈ సంఘటన మరోసారి చాటిచెప్పింది.
-కణ్వస