దేశంలో ఒక ప్రాంతం వెనుకబడితే అది ఉన్న రాష్ట్రం నుండి విడిపోవడమే దానికి సరయిన పరిష్కారంగా అందరూ భావిస్తున్నారిప్పుడు. ఆవిధంగానే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా విడిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుండి రాయలసీమ విడగొట్టేందుకు రాజకీయ నిరుద్యోగులు అందరూ ఏకమవుతున్నారు. రాయలసీమ విడిపోయే మాటయితే ఉత్తరాంధ్రా కూడా వేరే రాష్ట్రంగా ఏర్పరచాలని ఉద్యమం ప్రారంభిస్తారేమో. ఆ తరువాత ఆ రాజకీయ నిరుద్యోగులకు అధికారం ఏర్పాటు చేసుకోవడం కోసం విశాఖ రాష్ట్రం, విజయనగర రాష్ట్రం, శ్రీకాకుళం రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలని భావించినా ఆశ్చర్యం లేదు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమకు చెందిన వ్యక్తి అయినప్పటికీ అభివృద్ధిని అంతా కృష్ణా, గుంటూరు జిల్లాలోనే కేంద్రీకరిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన పొరపాటే మళ్ళీ పునరావృతం అవుతున్నట్లు కనిపిస్తోంది. కర్నూలులో రాజధానిని ఏర్పాటు చేయాలని రాయలసీమవాసులు మొదట ఉద్యమించినప్పటికీ, ఆ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం గట్టిగా హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. కడప, ప్రకాశం జిల్లాలలో ఎటువంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం లేదు. కానీ చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టారు. అయితే అవింకా ఊపందుకోకపోవడంతో మొత్తంగా చూసినట్లయితే రాయలసీమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనే భావన ప్రజలకు కలిగేందుకు అవకాశం ఏర్పడుతోంది.
ఆ కారణంగా ప్రజలలో నెలకొన్న అసంతృప్తిని తట్టి లేపడానికి వైకాపా సీనియర్ నేత ఎం.వి.మైసూరారెడ్డి నేతృత్వంలో “ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సాధన సమితి” ఏర్పాటుకి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆయన ఈ నెల 20న వైకాపాకు రాజీనామా చేసి, 21న దానిని లాంఛనంగా స్థాపించబోతున్నారని తాజా సమాచారం. అందుకోసం బుదవారం సాయంత్రం రాయలసీమకు చెందిన కాంగ్రెస్, వైకాపా నేతలు శ్రీకాంత్‌రెడ్డి, శైలజానాథ్, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. తెదేపాలో చంద్రబాబు నాయుడు పట్ల అసంతృప్తిగా ఉన్న సీమ నేతలను కూడా తమ పోరాటంలోకి ఆహ్వానించాలని వారు భావిస్తున్నారు.ఏడు జిల్లాలతో కలిపి రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచాలనే ప్రధాన డిమాండ్ తో వారు తమ పోరాటం ప్రారంభించనున్నారని తెలుస్తోంది.
రాష్ర్ట ప్రజల అభీష్టానికి విరుద్దంగా రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పినప్పటికీ మళ్ళీ మరోమారు అదే తప్పు చేయడానికి సిద్దం అవుతుండటం ఆశ్చర్యంగా ఉంది. అలాగే ప్రత్యేక హోదా అంశంపై పోరాడి చేతులు ఎత్తేసిన జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర పోరాటాలు చేసిన సంగతి మరిచిపోయి తన రాజకీయ లబ్ది కోసం తన పార్టీ నేతలను రాష్ట్ర విభజన కోసం వెనుక నుండి ప్రోత్సహిస్తునట్లుంది. ప్రజలకు మార్గదర్శనం చేసి రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేయవలసిన రాజకీయ నేతలు తమ స్వార్ధ రాజకీయాల కోసం దేశాన్ని రాష్ట్రాన్ని ఇలాగ ముక్కలు చెక్కలు చేసుకొనే ప్రయత్నాలు చేస్తుండటం చూస్తుంటే వారిని అడ్డుకోనేవారే లేరా? వారి అభిప్రాయలే ప్రజాభిప్రాయాలుగా పరిగణించాలా? అని బాధ కలుగుతుంది.