వరంగల్ ఉప ఎన్నికలకు నామినేషన్లు వేసేందుకు బుదవారం సాయంత్రం గడువు ముగిసిన తరువాత మొత్తం ఐదుగురు అభ్యర్ధులు బరిలో మిగిలారు. వారు తెరాసకు చెందిన పసునూరి దయాకర్, టీడీపీ-బీజేపీల ఉమ్మడి అభ్యర్ధిగా దేవయ్య, కాంగ్రెస్ పార్టీ తరపున సర్వే సత్యనారాయణ, వామ పక్షాలు బలపరుస్తున్న స్వతంత్ర అభ్యర్ధి గాలి వినోద్ కుమార్ మరియు వైకాపా తరపున నల్లా సూర్యప్రకాశ్ బరిలో మిగిలారు.
వారిలో దేవయ్య తప్ప మిగిలిన అందరూ మంచి రాజకీయ అనుభవం ఉన్నవారే. తెరాస అభ్యర్ధి తెలంగాణా రాష్ట్రాభివృద్ధికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని హైలైట్ చేస్తూ ప్రజలను ఓట్లు కోరవచ్చును. టీడీపీ-బీజేపీల ఉమ్మడి అభ్యర్ధిగా దేవయ్య నరేంద్ర మోడీ సమర్ధమయిన పరిపాలన, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, స్థానిక అంశాలను ప్రస్తావించి ఓట్లు కోరవచ్చును. ఇక వైకాపా అభ్యర్ధి నల్లా సూర్యప్రకాశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పధకాల గురించి ప్రచారం చేసుకొని ఓట్లు కోరవచ్చును. వామ పక్షాలు బలపరుస్తున్న గాలి వినోద్ కుమార్ తెలంగాణా ప్రభుత్వం రైతుల పట్ల ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరి, రైతుల ఆత్మహత్యలు మొదలయిన అంశాలను ప్రస్తావించి ప్రజలను ఓట్లు కోరవచ్చును.
వారిలో దయాకర్ అధికార పార్టీకి చెందినవాడయి ఉండటం, దాని మద్దతు కలిగి ఉండటం ఆయనకి కలిసి వచ్చే అంశాలు. అలాగే ఎన్డీయే అభ్యర్ధి దేవయ్యకు కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీకి చెందినవాడయి ఉండటం కలిసి వచ్చే అంశం. తనకు ఓటేసి గెలిపిస్తే జిల్లా అభివృద్ధికి కేంద్రం నుండి సహాయ సహకారాలు పొందవచ్చని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేయవచ్చును. వామ పక్షాలు బలపరుస్తున్న గాలి వినోద్ కుమార్ యువకుడు, మేధావి, తెలంగాణా సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా మంచి పేరుంది కనుక ప్రజలు ఆయనను ఆదరించే అవకాశం ఉంది. పైగా వామ పక్షాలన్నీ ఆయనని బలపరుస్తున్నాయి. ఈ ఎన్నికలలో ఓట్లు చీల్చి తెరాసకు లబ్ది చేకూర్చడానికే వైకాపా నల్లా సూర్యప్రకాశ్ ను రంగంలో దింపి ఉండవచ్చును.