హైదరాబాద్: అమరావతిలో రాజధాని నిర్మాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. రాజధాని నిర్మాణానికి లభించినట్లు చెబుతున్న పర్యావరణ అనుమతులను అన్‌లైన్‌లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించింది. సాంకేతిక సమస్యల కారణంగా ఆన్‌లైన్‌లో పెట్టలేకపోయామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధికారులు చెప్పారు. వాటిని తమముందుకూడా పెట్టాలని ట్రిబ్యునల్ సూచించింది. ఆన్‌లైన్‌లోకూడా పెట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని సీఆర్‌డీఏను ఆదేశించింది. తడినేలలను, ముంపు ప్రాంతాలను గుర్తించారా అని అడిగింది. దానిపై సీఆర్‌డీఏ నివేదిక సమర్పించింది.
మరోవైపు పర్యావరణ అనుమతులు లభించేవరకు అమరావతిలో ఎటువంటి కార్యక్రమమూ జరపకూడదని స్టే ఉన్నాకూడా, శంకుస్థాపన జరిపారంటూ ఇవాళ ట్రిబ్యునల్‌లో కోర్ట్ ధిక్కార పిటిషన్ దాఖలయింది. దీనిపై వారంలోగా సమాధానం చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి, సీఆర్‌డీఏకు, కేంద్ర పట్టణాభివృద్ధి, పర్యావరణ శాఖలకు ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను ఈనెల 19కు వాయిదా వేసింది. అమరావతి నిర్మాణంలో ఎన్నో ఎకరాల సారవంతమైన భూమిని పాడుచేస్తున్నారని, లక్షల సంఖ్యలో చెట్లను కొట్టేస్తున్నారని పర్యావరణ చట్టాలను, నిబంధనలను పాటించటంలేదని ఆరోపిస్తూ పండలనేని శ్రీమన్నారాయణ అనే సీనియర్ జర్నలిస్ట్ సుప్రీం కోర్ట్‌లో దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈయన పేరుమీద వైఎస్ఆర్ కాంగ్రెస్సే ఈ కేసును వేయించిందనే ఆరోపణలు ఉన్నాయి.