హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం మూడు బంగారం డిపాజిట్ పథకాలను ఇవాళ ప్రవేశపెట్టింది. దేశంలో రు.5,40,000 కోట్ల విలువ చేసే 20 వేల టన్నుల బంగారం వృథాగా ఇళ్ళలో పడి మూలుగుతోందని, ఈ పథకాల ద్వారా ఆ బంగారాన్ని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్(జీఎంఎస్), గోల్డ్ సావరిన్ బాండ్, గోల్డ్ కాయిన్ అనే ఈ మూడు పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఇవాళ ఢిల్లీలో ప్రారంభించారు. మొదటి పథకంలో బంగారం డిపాజిట్‌లపై వడ్డీ ఇస్తారు… రెండో పథకంలో గోల్డ్ బాండ్‌లను విడుదల చేశారు. మూడో పథకంలో భాగంగా మొట్టమొదటి భారత గోల్డ్ కాయిన్‌ను మోడి ఆవిష్కరించారు. బంగారం దిగుమతులను తగ్గించి, విదేశీమారకాన్ని పెంచే లక్ష్యంతో కాయిన్స్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఏటా 1,000 టన్నుల బంగారం దేశంలోకి దిగుమతి అవుతోంది. ఇవాళ విడుదల చేసిన గోల్డ్ కాయిన్‌లపై ఒకవైపు అశోకచక్రం, మరోవైపు మహాత్మా గాంధి బొమ్మలను ముద్రించారు. వీటిని 5, 10, 20 గ్రాముల బరువులో విడుదల చేశారు. బంగారం వినియోగంలో భారత్ చైనానుకూడా అధిగమించి ప్రథమస్థానానికి చేరుకుందని మోడి అన్నారు. దేశంలో ఈ ఏడాది 562 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారని చెప్పారు. భారతదేశం పేదదేశంగా మిగిలిపోవాల్సిన అవసరంలేదని, మరి కొద్ది కృషి, సరైన విధానాల ద్వారా భారత్ పేద ముద్రను వదిలించుకోవచ్చని అన్నారు.