హైదరాబాద్: విజయవాడ నగరంలో ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ దుర్గగుడి ఫ్లై ఓవర్‌కు ఎట్టకేలకు మోక్షం కలిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కోసం రు.467 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. పనులను రెండు ప్యాకేజిలుగా విభజించి వేర్వేరు కాంట్రాక్టర్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా ఒక ప్యాకేజ్‌లోని రు.282 కోట్ల నిర్మాణ పనులను సోమా కంపెనీ కైవసం చేసుకుంది. మరోవైపు ఫ్లై ఓవర్ కోసం నిర్వాసితులయ్యే వారికి పరిహారం చెల్లింపులు పూర్తవటంతో వారి ఇళ్ళు, దుకాణాల భవనాలను తొలగించే కార్యక్రమం ప్రారంభమయింది.
హైదరాబాద్‌నుంచి విజయవాడలోకి ప్రవేశించటానికి దుర్గగుడి ప్రాంతంలో తరచూ ఏర్పడే ట్రాఫిక్ సమస్యలు తీవ్ర ఆటంకంగా ఉన్నాయి. దీనికి పరిష్కారంగా ఒక ఫ్లై ఓవర్ నిర్మించాలని నగరవాసులు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికోసం పార్టీలకతీతంగా ఉద్యమాలుకూడా జరిగాయి. తాము అధికారంలోకి వస్తే ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం చేపడతామని టీడీపీ గత ఎన్నికలలో హామీఇచ్చింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంనుంచి అనుమతితోపాటు నిధులుకూడా మంజూరు చేయించుకుంది. ఈ టెండర్కోసం సోమా, నవయుగ, ఎల్ అండ్ టీ సంస్థలు పోటీపడగా సోమా దక్కించుకుంది. శంకుస్థాపన కార్యక్రమం కొద్దిరోజులలో జరుగనుంది. నిర్మాణం పూర్తికావటానికి రెండేళ్ళు పడుతుందని అధికారులు చెబుతున్నారు. కృష్ణానదిలో పిల్లర్లు వేసి బ్యారేజి మీదగా నాలుగు లైన్లతో ఫ్లై ఓవర్ నిర్మిస్తారు.