హైదరాబాద్: దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ నుంచి తీవ్రస్థాయిలో ప్రాణహాని ఉండటంతో భారత్‌కు తీసుకొచ్చిన ముంబై అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్‌కు డూప్‌ను పెట్టాలని ఇక్కడి పోలీసులు యోచిస్తున్నారు. ఛోటా రాజన్ ముంబాయిలోగానీ, ఢిల్లీలోగానీ – ఇండియాలో ఉన్నంతకాలం అతని పక్కనే ఈ డూప్‌ను కూడా ఉంచాలని పోలీసుల యోచన. తద్వారా దాడిచేయాలనుకునేవారిని అయోమయానికి గురిచేయొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఛోటా రాజన్ అంత ఎత్తు, లావు ఉన్న వ్యక్తిని ఒకరిని ఇప్పటికే పోలీసులు పట్టుకున్నారు. రాజన్‌ను ఎక్కడికైనా తీసుకెళ్ళేటపుడు అతనికి, డూప్‌కు ఇద్దరికీ ముఖాలకు ముసుగువేసి తీసుకెళ్ళాలని పోలీసుల ప్లాన్. వీరికి 25-30 మంది కమాండోలతో అత్యున్నతస్థాయి భద్రత కల్పిస్తున్నారు. ఈ ఉదయం ఢిల్లీ ఇందిరాగాంధి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఛోటా రాజన్ దిగిన దగ్గరనుంచి డూప్‌ను రంగంలోకి దించినట్లు అభిజ్ఞవర్గాల సమాచారం.
రాజన్‌కు దావూద్ నుంచేకాక, సొంతముఠాలోని కొందరు వ్యతిరేకులనుంచికూడా ముప్పు ఉందని చెబుతున్నారు. వీరు గతంలో రాజన్ దగ్గర పనిచేసి అసంతృప్తితో అక్కడనుంచి బయటకొచ్చి ఛోటా షకీల్ గ్యాంగ్‌లో చేరినట్లు సమాచారం. కొందరు రాజకీయనేతుల, పోలీస్ అధికారులనుంచికూడా రాజన్‌కు ముప్పు ఉండొచ్చని అంచనా. ముంబాయి పోలీసులలో దావూద్ మనుషులు ఉన్నారని రాజన్ బాలిలో మొన్న ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఇవాళ ఛోటా రాజన్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక విమానంనుంచి దిగగానే నాటకీయంగా భూమిని ముద్దాడాడు. పటిష్ఠమైన భద్రతమధ్య అతనిని సీబీఐ హెడ్ క్వార్టర్స్ కార్యాలయానికి తరలించారు. దీనికోసం డమ్మీ కాన్వాయ్ కూడా వాడారు. అక్కడే విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే రాజన్‌కు కిడ్నీ ప్రాబ్లమ్ ఉండటంతో అతనికి డయాలసిస్ చేయాల్సి ఉంది. దీనికోసం ఎయిమ్స్‌కు తరలించటంపై అధికారులు యోచిస్తున్నారు. రాజన్‌పై ముంబాయిలో 75, ఢిల్లీలో 10 కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నింటినీ సీబీఐకు బదిలీ చేశారు. రాజన్ తన చిరకాల శత్రువు దావూద్ గుట్టును భారత పోలీసులముందు విప్పుతానంటున్నాడు.