హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌నుంచి ఎర్రచందనాన్ని పెద్దఎత్తున చైనాకు స్మగ్లింగ్ చేస్తున్న స్మగ్లర్‌లు మధ్యప్రదేశ్‌ను స్టాకింగ్ కేంద్రాలు నిర్వహించటానికి ఉపయోగించుకుంటున్నారు. మధ్యప్రదేశ్ అటవీశాఖకు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఇటీవల పులులను అక్రమంగా వేటాడుతున్న తమంగ్ అనే ఒక అడవి దొంగను పట్టుకోగా ఎర్రచందనం స్మగ్లింగ్ వివరాలు బయటకొచ్చాయి. ఇటీవల ఎర్రచందనం స్మగ్లింగ్ కోసం ఒక కొత్త ముఠా ఏర్పడిందని, ఈ ముఠా సభ్యులు, ఏపీనుంచి తీసుకొచ్చిన ఎర్రచందనాన్ని చైనాకు తరలించేముందు మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ, కత్ని జిల్లాలలో స్టాక్ చేస్తున్నారని తమంగ్ చెప్పాడు. నేపాల్‌కు చెందిన తమంగ్‌ను ఢిల్లీలో పులిచర్మాలు, అలుగు అనే జంతువు వంటిపైఉండే పొలుసులను అమ్ముతుండగా నిఘావేసి పట్టుకున్నారు. అతనిని ఇంటరాగేట్ చేస్తుండగా ఎర్రచందనం వివరాలు బయటకొచ్చాయి. దీనితో ఆశ్చర్యపోయిన అధికారులు ఈ సమాచారాన్ని ఏపీ పోలీసులకు తెలిపారు. తమంగ్‌ను విచారించటంకోసం ఏపీ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు భోపాల్ వెళ్ళారు.
ఆంధ్రప్రదేశ్‌నుంచి ఈ ఏడాది సుమారు 2,000 టన్నుల ఎర్రచందనాన్ని స్మగ్లర్‌లు విదేశాలకు తరలించినట్లు ఒక అంచనా. స్మగ్లర్లు ఎర్రచందనాన్ని ఆకాశం లేదా సముద్ర మార్గాలద్వారా దుబాయ్‌కు, అక్కడనుంచి పాకిస్తాన్‌కు, అక్కడనుంచి చైనాకు తరలిస్తున్నారని సమాచారం. మరోవిధంగా పశ్చిమ బెంగాల్, బాంగ్లాదేశ్, బర్మా మార్గంలోకూడా చైనాకు తరలిస్తున్నారని అంటున్నారు.
పులుల వేటగాడు తమంగ్‌కుకూడా చైనాలోని అనేక ముఠాలతో సంబంధాలున్నాయని అటవీశాఖ అధికారుల విచారణలో తేలింది. అతని బ్యాంక్ ఖాతాలలో లక్షల్లో పెద్ద పెద్ద మొత్తాలు డిపాజిట్ అవుతున్నట్లు తాము గమనించామని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శాఖకు దీనిగురించి తెలిపామని అధికారులు చెప్పారు.