హైదరాబాద్: రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకోవటంతో ఆ ప్రాంతంలోని పలువురు మాజీలు, రాజకీయ నిరుద్యోగులకు కొత్త ఉత్సాహం పుట్టుకొస్తోంది. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న డాక్టర్ మైసూరారెడ్డి ఇప్పటికే సీమ ఉద్యమంలో కీలకపాత్ర పోషించటానికి తయారవగా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ డీఎల్ రవీంద్రరెడ్డికూడా తెరపైకి వచ్చారు. 17 నెలల విరామం తర్వాత బయటకు వచ్చిన డీఎల్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ, అమరావతిపై రాయలసీమలో తీవ్ర అసంతృప్తి ఉందని అన్నారు. ఈ నెల 21న తిరుపతిలో రాయలసీమ జిల్లాల నేతలతో సమావేశం అవుతామని చెప్పారు. రాయలసీమలో సెంటిమెంట్ బాగా పెరిగిందని, తమకు అన్యాయం జరిగిందని సీమ ప్రజలు బలంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఒక పక్కన రాయలసీమలో తీవ్ర కరువు నెలకొని ఉండగా అమరావతిలో అంత ఘనంగా కార్యక్రమం చేయటమేమిటని ప్రశ్నించారు. మెట్టకు, మాగాణికి దేనికీ చుక్క నీరు అందటంలేదని, కేసీ కెనాల్ ఎండిపోయిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెలికాప్టర్లు, విమానాలలో తిరగటం తప్ప చేస్తున్నదేమీ లేదని విమర్శించారు. రాయలసీమ ప్రజలు టీడీపీ ప్రభుత్వ వ్యవహారశైలిపై తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ఈనెల 21న తిరుపతిలో జరిగే సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయం జరుగుతుందని డీఎల్ అన్నారు. అమరావతిపై రాయలసీమలోనే కాక ఉత్తరాంధ్రలోనూ అసంతృప్తి ఉందని చెప్పారు. రాయలసీమ ఉద్యమానికి చంద్రబాబు, జగన్ మద్దతివ్వాలని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పాలన సరిగా లేదని అభిప్రాయపడ్డారు.