బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజేత ఎవరనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. గురువారం చివరి విడత పోలింగ్ తర్వాత అనేక న్యూస్ చానల్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడించాయి. ఎక్కువ చానల్స్ జేడీయూ మహాకూటమికి విజయావకాశాలున్నాయని అంచనా వేశాయి. మూడు చానల్స్ మాత్రం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే గెలుస్తుందని అంచనా వేశాయి. దీంతో, నిజంగా ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.
ఎన్.డి.టి.వి. చానల్ శుక్రవారం రాత్రి ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. విడతల వారీగా ఫలితాలను విశ్లేషించింది. దాని ప్రకారం, సగటున ఎన్డీయేకు 125, జేడీయూ నాయకత్వంలోని మహాకూటమికి 110 సీట్లు రావచ్చు.
ఈ సర్వే ప్రకారం, తొలివిడతలో మహాకూటమి ఎక్కువ సీట్లు గెలుస్తుంది. ఆశ్చర్యకరంగా, మహాకూటమి గంపెడాశలు పెట్టుకున్న మూడో విడతలో బీజేపీ భారీ ఆధిక్యం సాధిస్తుందని సర్వే అంచనా వేసింది. ఇది నితీష్ సొంత ప్రాంతమైనా, బీజేపీ కూటమి పూర్తి ఆధిపత్యం సాధిస్తుందని తేల్చింది. ఇక, మైనారిటీలు ఎక్కువగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో ఐదో విడతలోనూ రెండు కూటములకూ దాదాపు సమానంగా సీట్లు వస్తాయని అంచనా. ఈ విడతలో మహా కూటమికి 26 నుంచి 30, ఎన్డీయేకు 26 నుంచి 29 సీట్లు రావచ్చు.
కచ్చితమైన సర్వేలు చేస్తుందని పేరున్న ఎన్డీటీవీ అంచనాయే నిజమైతే, నితీష్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమే. ఈ ఫలితాలతో ప్రధాని మోడీకి మరింత బలం చేకూరుతుంది. అమిత్ షా ఖ్యాతి పెరుగుతుంది. ఆర్థిక సంస్కరణలు వేగవంతం అవుతాయని వివిధ దేశాల్లోని పారిశ్రామిక వేత్తలకు భరోసా కలుగుతుంది. స్టాక్ మార్కెట్లు రంకెలు వేస్తాయి. ఇంతకీ ఈ సర్వే నిజమవుతుందా లేదా? అదివారం జరిగే ఓట్ల లెక్కింపులో తేలిపోతుంది.
ఎన్టీటీవీ ఎగ్జిట్ పోల్ అంచనాల పట్టిక (మొత్తం 243 సీట్లు)
.. | బీజేపీ+ | జేడీయూ + |
---|---|---|
మొదటి విడత | 18-22 | 26-30 |
రెండో విడత | 17-21 | 10-14 |
మూడో విడత | 26-30 | 19-23 |
నాలుగో విడత | 29-33 | 19-23 |
ఐదో విడత | 25-29 | 26-30 |