ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకొనేవారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత బాక్సైట్ తవ్వకాలకు ఏపీఎండీసీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడమే ఆలస్యం అప్పుడే ఏపీఎండీసీ అధికారులు అందుకోసం చురుకుగా ఏర్పాట్లు మొదలుపెట్టేసారు కూడా. బాక్సైట్ తవ్వకాల వలన ఏజన్సీ ప్రాంతంలో విస్తరించి ఉన్న పచ్చదనం, దానితో బాటే అక్కడ ఉండే జీవరాశి అన్నీ హరించుకుపోతాయి. వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న అక్కడి గిరిజనులు నిరాశ్రయులు అవుతారు. అందుకే బాక్సైట్ తవ్వకాలను గిరిజనులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మావోయిస్టులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ముందుకే వెళ్లాలని నిర్ణయించుకోవడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేడు ప్రజా సంఘాలు విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బంద్ కి పిలుపునిచ్చాయి. ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు పూనుకొంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని మావోయిస్టులు హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొన్ని ప్రజా సంఘాలు హైకోర్టులో న్యాయపోరాటం చేసేందుకు సిద్దం అవుతున్నాయి.