మాజీ కాంగ్రెస్ ఎంపీ రాజయ్య ఇంట్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆయన కోడలు, ముగ్గురు మనుమలు సజీవ దహనం అవడం, రాజయ్యతో సహా ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. సారిక ఆమె ముగ్గురు కుమారుల శవాలకు వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించగా అందులో దిగ్బ్రాంతికరమయిన విషయాలు బయటపడుతున్నాయి. వారి పోస్ట్ మార్టం నివేదికను పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణుడు నాగ మోహన్ మీడియాతోమాట్లాడుతూ, “సారిక పక్కటెముకలు విరిగి ఉన్నాయి. ఆమె ఇద్దరి పిల్లలలో అభినవ్ మరియు శ్రీయన్ ల కాలి ఎముకలు విరిగి ఉన్నాయి. చనిపోయిన నలుగురి ఊపిరి తిత్తుల్లో దట్టమయిన పొగ నిండి ఉంది. అగ్నిప్రమాదం జరిగినప్పుడు గదిలో వెలువడిన దట్టమయిన పొగలు వాళ్ళు పీల్చి ఉండటంతో అది వారి ఊపిరితిత్తుల్లోకి చేరుకొంది. ఆ పరిస్థితుల్లో వారు చనిపోవడంతో అది వారి ఊపిరి తిత్తులలోనే నిలిచి ఉండిపోయింది,” అని తెలిపారు.
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న హన్మకొండ డీ.ఎస్.పి. శోభన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, “మేము శవాల పంచనామా చేసిన తరువాత నివేదిక సిద్దం చేస్తున్నాము. ఇంకా పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ నివేదికల అందవలసి ఉంది. వాటి కోసం ఎదురు చూస్తున్నాము. మరో రెండు-మూడు రోజులలో అన్ని నివేదికలు సిద్దం అవుతాయి. అవన్నీ చేతికి అందితే కానీ ఇవి హత్యాలా లేక ఆత్మహత్యా అని నిర్దారించలేము,” అని అన్నారు.